YSR Zero Interest : వైఎస్ఆర్ సున్నా వడ్డీ.. రూ.1,109 కోట్లు నిధుల విడుదల
ఏపీలోని పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్లు నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా చెల్లింపులు చేసింది.

Ysr Zero Interest Scheme Funds Released
YSR Zero Interest Scheme : ఏపీలోని పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్లు నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా చెల్లింపులు చేసింది. 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. స్వయం సహాయక సంఘాల రుణ ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. ఈ మేరకు సీఎం జగన్ శుక్రవారం (ఏప్రిల్ 23, 2021) వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. చిన్న పిల్లలు మొదలు.. అవ్వల వరకు అందరికీ అండగా నిలబడ్డామని చెప్పారు.
2019 ఏప్రిల్ నాటికి 8.71లక్షల పొదుపు సంఘాలు ఉండేవని…ప్రస్తుతం రాష్ట్రంలో 9.34లక్షల పొదుపు సంఘాలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని.. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి పొదుపు సంఘాలను అప్పుల పాలు చేసిందని విమర్శించారు. 8.71లక్షల అక్కచెల్లెమ్మలకు తమ ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. సున్నావడ్డీ పథకం కింద తొలివిడతో రూ.6,792కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.
బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీ నగదు జమ చేసినట్లు తెలిపారు. 24.6లక్షల మహిళలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి చేకూర్చామని చెప్పారు. నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి రూ.75వేల చొప్పున అందించే మొత్తం రూ.18500కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా పేద మహిలళకు ఏటా రూ.15వేల చొప్పున అందిస్తామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఒక్కొక్కరికి 45వేలు అందిస్తామని తెలిపారు. సంవత్సరానికి రూ.600కోట్ల చొప్పున ముడేళ్లలో రూ.1800కోట్లు వారికి కేటాయిస్తామని చెప్పారు.
వసతి దీవెన కింద అమ్మల ఖాతాల్లో ఏటా రూ.20వేలు ఇస్తున్నామని తెలిపారు. వసతి దీవెన పథకంలో భాగంగా తొలివిడతలో రూ.1221కోట్లు అందించామని పేర్కొన్నారు. ఈ నెల 28న మరో రూ.1200కోట్లు అందించబోతున్నామని వెల్లడించారు.