పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారు, మళ్లీ జగనే సీఎం- మంత్రి అంబటి రాంబాబు

హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల కాల్ డేటాలు సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థం అవుతుందన్నారు.

పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారు, మళ్లీ జగనే సీఎం- మంత్రి అంబటి రాంబాబు

Ap Poll Violence : చంద్రబాబు, పురంధేశ్వరిల విజ్ఞప్తితోనే ఎన్నికల సంఘం పోలీసు అధికారులను, కలెక్టర్లను మార్చిందని వైసీపీ నేతలు ఆరోపించారు. విచిత్రంగా అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయి, సస్పెన్షన్లూ జరిగాయని అన్నారు. అదే అంశాన్ని సిట్ కి వివరించామని వైసీపీ నేతలు వెల్లడించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్నినాని, జోగి రమేశ్, అప్పిరెడ్డి, కైలే అనిల్ తదితరులు డీజీపీ కార్యాలయంలో సిట్ బృందాన్ని కలిశారు.

ఏపీలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీడీపీ పన్నిన పన్నాగంలో పోలీసులు భాగస్వాములు అయ్యారని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల కాల్ డేటా సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థం అవుతుందన్నారు.

ఇది చాలా సీరియస్ ఇష్యూ అని వ్యాఖ్యానించారు. సిట్ అధిపతి కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్ అన్న మంత్రి అంబటి.. పల్నాడు ప్రాంతంలో ఘటనలు జరిగిన గ్రామాల నుంచి బలహీనవర్గాలు వెళ్లిపోయాయని వాపోయారు. తాడిపత్రిలో పోలీసులే సిసి కెమెరాలను పగలగొట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

మరోసారి జగనే సీఎం- జోగి రమేశ్
వ్యవస్థలను మేనేజ్ చేసి, ఆ వ్యవస్థల్లో ఉన్న కొందరు వ్యక్తులను ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలు పన్నిందో చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ నాటి ఎన్నికల ప్రక్రియలో అనేక దారుణాలు జరిగాయి. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి జగన్ ను ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసం సృష్టించారో, వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారో అంతా చూశారు. ఏ జిల్లాల్లో అయితే ఎస్పీలు, కలెక్టర్లను మార్చారో అదే చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై సిట్ అధికారులకు విన్నవించాం. చర్యలు తీసుకోవాలని కోరాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతటి దుర్మార్గాలను ప్రేరేపించింది టీడీపీ, దాని అధినేత చంద్రబాబు. ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్ ను ఎదుర్కోలేకి చంద్రబాబు హింసను ప్రేరేపించారు. విధ్వంసానికి దిగారు. ప్రజా తీర్పు రాబోతోంది. తప్పనిసరిగా జగన్ మరోసారి సీఎం కాబోతున్నారు.

Also Read : గెలుపు ఎవరిది? మెజార్టీ ఎంత? ఏపీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ