MLA Uma Shankar Ganesh : వైసీపీ బైక్ ర్యాలీలో ప్రమాదం, ఎమ్మెల్యేకి తీవ్ర గాయం..వీడియో ఇదిగో
బైక్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో స్కూటీపై నుంచి కింద పడ్డ గణేశ్ కాలికి తీవ్ర గాయమే అయ్యింది. ఆపరేషన్ తప్పదంటూ డాక్టర్లు కూడా ఆయనకు సూచించారట.

MLA Uma Shankar Ganesh : జగన్ సర్కార్ ప్రతిపాదించిన 3 రాజధానులకు మద్దతుగా అధికార పార్టీ వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు అమరావతే ఏకైక రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీకి మూడు రాజధానులకు మద్దతుగా అధికార పార్టీ నేతలు సైతం ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ సైతం.. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బైక్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో స్కూటీపై నుంచి కింద పడ్డ గణేశ్ కాలికి తీవ్ర గాయమే అయ్యింది. కాలికి ఎముక చిట్లినట్లు రిపోర్టుల్లో తేలింది. ఆపరేషన్ తప్పదంటూ డాక్టర్లు కూడా ఆయనకు సూచించారట. తాజాగా స్కూటీపై నుంచి గణేశ్ కింద పడ్డ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
నర్సీపట్నంలో బైక్ ర్యాలీకి పిలుపునిచ్చిన గణేశ్… తాను స్కూటీపై ముందుగా వెళుతున్నారు. గణేశ్ స్కూటీని అనుసరించి ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలోనే బైక్‌లపై బయలుదేరారు. ఈ క్రమంలో గణేశ్ స్కూటీకి కుడి వైపున బైక్‌పై వస్తున్న వైసీపీ కార్యకర్త తనకు కుడి వైపున ఉన్న బైక్ అలా చిన్నగా తగలగానే… కంట్రోల్ తప్పి గణేశ్ స్కూటీని ఢీకొట్టాడు. దీంతో గణేశ్ స్కూటీతో పాటు ఆ కార్యకర్త బైక్ కూడా ఒకదానిపై ఒకటి పడిపోయాయి. ఈ ప్రమాదంలో గణేశ్ కాస్తంత ఎగిరి పడ్డట్టుగా కనిపించారు.
ఏపీలో రాజధాని ఫైట్ తారస్థాయికి చేరింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా అధికార పార్టీ నేతలు సైతం పోరాటాలు స్టార్ట్ చేశారు. వైసీపీ నాయకులు బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తోన్నారు.
మరోవైపు రాజీనామాలు కూడా నమోదవుతుండటం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన స్పీకర్ కార్యాలయానికి పంపించారు. స్పీకర్ ఫార్మట్‌లోనే ఈ రాజీనామా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాజధానులను తక్షణమే ఏర్పాటు చేయాలనేది ఆయన డిమాండ్.
అదే సమయంలో సీఎం జగన్ సహచరుడు ధర్మాన ప్రసాద రావు, మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే- వెంటనే రాజీనామా చేస్తానని ధర్మాన ప్రకటించారు. ఉత్తరాంధ్ర వరకు మాత్రమే ఈ ఉద్యమాలు పరిమితం కాలేదు. అటు తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ దీని తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది.