Nellore City : నెల్లూరులో వైసీపీ పెద్ద సాహసం.. విజయం ఖాయమేనా?

వ్యూహ ప్రతివ్యూహాలతో రెండు పార్టీలూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇక మున్ముందు జరిగే రాజకీయ పరిణామాలే రాజకీయాన్ని డిసైడ్‌ చేసే పరిస్థితిని సూచిస్తున్నాయి.

Nellore City : నెల్లూరులో వైసీపీ పెద్ద సాహసం.. విజయం ఖాయమేనా?

Big Fight In Nellore City

Nellore City : నెల్లూరంటే చేపల పులుసుకే కాదు.. అందులోని మసాలా ఘాటు లాంటి రాజకీయానికి కూడా ఫేమస్. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇంకాస్త హీటు. ఈసారి ఎన్నికల్లో.. వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ కనిపిస్తోంది. వ్యూహా, ప్రతివ్యూహాలు, ఎత్తుకుపై ఎత్తులతో సిటీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా మారిన నెల్లూరు సిటీలో గెలుపు వైసీపీకి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది.. టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి నారాయణకు చెక్‌ చెప్పేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది వైసీపీ.

వైసీపీ అతిపెద్ద సాహసం..
నెల్లూరు పాలిటిక్స్ ఎంత హీట్ పుట్టిస్తాయో.. అంతే ఇంట్రస్టింగ్‌గానూ ఉంటాయ్. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఎప్పుడూ వాడివేడి రాజకీయ యుద్ధమే జరుగుతుంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ.. ఇప్పుడు వైసీపీకి అడ్డా. 2014 నుంచి ఇక్కడ ఫ్యాన్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. నెల్లూరు సిటీ సెగ్మెంట్‌లో మొత్తం 28 డివిజన్లు, లక్షా 56 వేల ఓట్లు ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఆనం కుటుంబీకులు ఐదు సార్లు గెలిచిన నెల్లూరు సిటీ.. గత రెండు సార్లు బీసీ నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌ వశమైంది.

నియోజకవర్గ మార్పు చేర్పుల్లో భాగంగా అనిల్‌కుమార్‌ యాదవ్‌.. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లిపోవడంతో ఈసారి మైనార్టీ నేత ఖలీల్‌కు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఆయనపై టీడీపీ సీనియర్‌ నేత నారాయణ పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత నారాయణపై మైనార్టీ నేతను ప్రయోగించడం ద్వారా వైసీపీ పెద్ద సాహసమే చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.

ఖలీల్ కు కొండంత అండగా ఆయన..
ఇక గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన నారాయణ ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుండగా, అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖలీల్‌ అహ్మద్‌ చెమటోడ్చుతున్నారు. మొత్తానికి సింహపురి సింహాసనం కోసం ఇద్దరూ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతున్నారు. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండటంతో ఖలీల్ అహ్మద్‌కు కొండంత అండ లభించినట్లైంది. విజయసాయి అండదండతో ఆర్థికంగా బలమైన నేత నారాయణను మట్టికరిపిస్తానని అంటున్నారు ఖలీల్‌ అహ్మద్‌.

టీడీపీలోకి వైసీపీ కీలక నేతలు..
గత పదేళ్లుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీకే అనుకూలంగా తీర్పునిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సింహపురిలో జెండా పాతాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది టీడీపీ. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని తానే అభివృద్ధి చేశానని ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి నారాయణను మరోమారు బరిలోకి దింపిన టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైసీపీలోని కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని బలం, బలగం పెంచుకున్న టీడీపీ.. గెలుపుపై ధీమాగా కనిపిస్తోంది.

ఒక్క ఛాన్స్ అంటున్న నారాయణ..
2014 నుంచి 2019 వరకు మంత్రిగా పనిచేసిన నారాయణ.. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. విద్యాసంస్థల అధినేతగా, టీడీపీలో కీలక నేతగా ఎదిగిన నారాయణ.. మంత్రిగా సిటీలో తనదైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఓడినా, నియోజకవర్గాన్ని మాత్రం వదల్లేదు. ఎప్పటికప్పుడు క్యాడర్‌తో సమన్వయం చేసుకుంటూ విజయం కోసం పరితపిస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ ఒక్కచాన్స్‌ ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు.

అభివృద్ధి పేరుతో అప్పులు అంటూ ఎదురుదాడి..
ఐతే నారాయణ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు వైసీపీ అభ్యర్థి ఖలీల్‌ అహ్మద్‌. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్న ఖలీల్.. నారాయణ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని తిప్పికొడుతున్నారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి.. కార్పొరేషన్‌పై భారం మోపారని విమర్శిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాకే నెల్లూరు అభివృద్ధి చెందిందని తన వాదన వినిపిస్తున్నారు ఖలీల్‌ అహ్మద్‌.

ఆ ముగ్గురి అండతో తగ్గేదేలే అంటున్న ఖలీల్..
టీడీపీ అభ్యర్థి నారాయణతో పోల్చితే ఆర్థికంగా బలం లేని ఖలీల్‌.. పార్టీ పెద్దల అండతో తగ్గేదేలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ కీలకనేత విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తుండటం ఖలీల్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి కూడా ఖలీల్ అహ్మద్ విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. మైనార్టీలకు తొలి అవకాశం ఇచ్చిన పార్టీగా ఆ వర్గానికి చెందిన ఓట్లపై ఫుల్‌ఫోకస్‌ పెట్టిన వైసీపీ తన స్థానం పదిలమని కాన్ఫిడెన్స్‌ చూపిస్తోంది.

ఎంపీ రూపంలో నారాయణకు అదనపు శక్తి..
మొత్తానికి రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి నారాయణ కుటుంబం మొత్తం ప్రచార పర్వంలో మునిగిపోయింది. నారాయణతోపాటు ఆయన భార్య రమాదేవి, కూతురు కూడా గడపగడపకు తిరుగుతున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూపంలో అదనపు శక్తిని కూడగట్టుకున్న నారాయణ ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేస్తాననే ధీమా ప్రదర్శిస్తున్నారు.

కంచుకోటను కాపాడుకోవడానికి వైసీపీ పావులు..
ఇదే సమయంలో వైసీపీ కూడా ప్రచారంలో ఎక్కడా తగ్గడం లేదు. పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తన కంచుకోటను కాపాడుకోడానికి మైనార్టీని బరిలోకి దింపిన వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సీఎం జగన్‌కు నమ్మిన బంటులాంటి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ను ఎంపీ అభ్యర్థిగా పంపాల్సిరావడంతో సిటీలో 46వేల ఓట్లున్న మైనార్టీకి చాన్స్‌ ఇచ్చింది. దీంతో సిటీతోపాటు ఎంపీ సీటులోనూ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది వైసీపీ. మొత్తానికి వ్యూహ ప్రతివ్యూహాలతో రెండు పార్టీలూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇక మున్ముందు జరిగే రాజకీయ పరిణామాలే రాజకీయాన్ని డిసైడ్‌ చేసే పరిస్థితిని సూచిస్తున్నాయి.

Also Read : టీడీపీ రికార్డ్‌ సృష్టిస్తుందా? వైసీపీ హ్యాట్రిక్‌ కొడుతుందా? కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఏది