Kurnool Lok Sabha Segment : టీడీపీ రికార్డ్‌ సృష్టిస్తుందా? వైసీపీ హ్యాట్రిక్‌ కొడుతుందా? కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఏది

40ఏళ్లలో కేవలం రెండుసార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? లేక వైసీపీ హ్యాట్రిక్‌ సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

Kurnool Lok Sabha Segment : టీడీపీ రికార్డ్‌ సృష్టిస్తుందా? వైసీపీ హ్యాట్రిక్‌ కొడుతుందా? కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఏది

Kurnool Lok Sabha Constituency

Kurnool Lok Sabha Segment : రాయలసీమ ముఖద్వారం కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తొలిసారి ఇద్దరు బీసీ నేతలు పోటీపడుతున్న కర్నూలు పార్లమెంట్‌కు ఎంతో చరిత్ర ఉంది. రెడ్డి నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఒకప్పుడు కాంగ్రెస్‌కు… ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా కొనసాగుతున్న కర్నూలులో ఈసారి పోటీ ఎలా ఉంది? కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఏది?

ఫ్యాన్ పార్టీ అడ్డాగా కర్నూలు..
రాయలసీమ రాజకీయాలకు కేంద్రం.. ఒకప్పటి ఏపీ రాజధాని నగరం కర్నూలు.. ఎందరో హేమాహేమీలు.. మరెందరో రాజకీయ ఉద్దండులను గెలిచిపించిన కర్నూలులో తొలిసారిగా ఇద్దరు బీసీ నేతల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, దామోదరం సంజీవయ్య వంటి అగ్రనేతలు ప్రాతినిధ్యం వహించిన కర్నూలు పార్లమెంట్‌ 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో తొమ్మిది సార్లు కాంగ్రెస్‌ పార్టీయే గెలిచింది. ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ఎక్కువసార్లు కర్నూలు ఎంపీగా పని చేశారు. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత కర్నూలు.. ఫ్యాన్‌ పార్టీ అడ్డాగా మారింది. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే కర్నూలును కైవసం చేసుకున్నారు.

టీడీపీ గెలిచింది రెండుసార్లే..
కర్నూలు పార్లమెంట్‌ పేరు చెబితే… కోట్ల, కేఈ కుటుంబాలే గుర్తుకు వస్తాయి. గత నాలుగు దశాబ్దాలలో ఈ రెండు కుటుంబాల మధ్యే ఎక్కువసార్లు పోటీ జరిగింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే కర్నూలు ఎంపీ సీటును గెలుచుకుంది. 1984లో ఒకసారి, 1999లో మరోసారి మాత్రమే కర్నూలులో గెలిచింది టీడీపీ. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు కావడంతో కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. కానీ, గత రెండు ఎన్నికల్లోనూ ఈ సీటు నుంచి బీసీ నేతలకే చాన్స్‌ ఇచ్చింది టీడీపీ. గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయడు పోటీ చేయగా వైసీపీ చేతిలో ఓడిపోయారు.

కర్నూలు మేయర్‌ అనూహ్యమైన అవకాశం..
కర్నూలు పార్లమెంట్‌లో వైసీపీకి గట్టి పట్టుంది. పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈసారి కూడా కర్నూలు పార్లమెంట్‌ సీటు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్‌ పార్టీ నేతలు. ముందుగా ఈ సీటు నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను పోటీలోకి దింపాలని భావించింది వైసీపీ. ఐతే పార్లమెంట్‌కు పోటీ చేయడానికి ఆసక్తిచూపని జయరాం.. ఏకంగా పార్టీని వీడి టీడీపీలో చేరడంతో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, కర్నూలు మేయర్‌ బీవై రామయ్యకు చాన్స్‌ ఇచ్చింది. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు మేయర్‌గా ఎన్నికైన రామయ్య.. అనూహ్యంగా వచ్చిన అవకాశంతో చురుగ్గా ప్రచారం ప్రారంభించారు. సీఎం జగన్‌ ఆశీస్సులు… స్థానిక నేతల అండదండలతో సత్తా చాటుతానంటున్నారు రామయ్య.

వైసీసీకి ధీటుగా టీడీపీ కొత్త ప్రయోగం..
ఇక వైసీపీకి దీటైన వ్యూహాలతో.. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కర్నూలులో గెలవాలనే టార్గెట్‌తో కొత్త ప్రయోగం చేస్తోంది టీడీపీ. గత రెండు ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చాన్స్‌ ఇచ్చిన టీడీపీ.. ఈ సారి కురవ సామాజికవర్గానికి చెందిన పంచలింగాల నాగరాజుకు టికెట్‌ ఇచ్చింది. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో వాల్మీకి సామాజిక వర్గానికి దాదాపు 5 లక్షల ఓట్లు ఉండగా.. కురవ, యాదవ సామాజికవర్గానికి కూడా దాదాపు 2లక్షల ఓట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సామాజిక సమీకరణాలతోనే ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న నాగరాజుకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది టీడీపీ.

అనూహ్యంగా ఛాన్స్ కొట్టేసిన నాగరాజు..
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు రూరల్‌ ఎంపీపీ పీఠం ఆశించిన నాగరాజు.. పంచలింగాల ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఐతే ఆ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు తేడాతో వైసీపీ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడంతో నాగరాజు ఎంపీటీసీగా మిగిలిపోయారు. ఐతే ఈసారి టీడీపీ కురవలకు ఎంపీ టికెట్‌ ఇచ్చే ఆలోచనలో ఉందని తెలుసుకుని.. స్థానిక నేతల సహకారంతో అనూహ్యంగా చాన్స్‌ కొట్టేశారు. పార్టీ సీనియర్‌ నేతలు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి సహకారంతో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తానని ధీమాగా చెబుతున్నారు నాగరాజు.

మొత్తానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కర్నూలు పార్లమెంట్‌పై ప్రత్యేకమైన స్కెచ్‌తో ముందుకు కదలుతున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ బీసీలకే టికెట్‌ ఇచ్చిన వైసీపీ ఈసారి అదే వ్యూహం అమలు చేయగా, టీడీపీ బీసీల్లో కురవలకు కొత్తగా అవకాశమిచ్చి ప్రయోగం చేస్తోంది. ఐతే రెండు పార్టీలకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు చికాకు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఎక్కువ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో టీడీపీలో కూడా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగానే ఉన్నాయి. రెండు పార్టీలకూ ఈ అసమ్మతి రాజకీయం చికాకు పెడుతుండటం.. గ్రూప్‌ ఫైట్‌ ఫలితాలపై ఎటాంటి ప్రభావం చూపుతుందనేది ఉత్కంఠగా మారింది. ఏదిఏమైనా అధికార వైసీపీ బలాన్ని తగ్గించడం టీడీపీకి సవాలేనని చెబుతున్నారు పరిశీలకులు. 40ఏళ్లలో కేవలం రెండుసార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? లేక వైసీపీ హ్యాట్రిక్‌ సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

Also Read : గుడివాడ వర్సెస్ పల్లా.. గాజువాకలో గెలుపెవరిది?