Gudivada Amarnath Vs Palla Srinivasa Rao : గుడివాడ వర్సెస్ పల్లా.. గాజువాకలో గెలుపెవరిది?

ఈ ఇద్దరూ లోకలే... మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు? గాజువాకపై ఎగిరే జెండా ఏది?

Gudivada Amarnath Vs Palla Srinivasa Rao : గుడివాడ వర్సెస్ పల్లా.. గాజువాకలో గెలుపెవరిది?

Gudivada Amarnath Vs Palla Srinivasa Rao

Gudivada Amarnath Vs Palla Srinivasa Rao : సాగర నగరం విశాఖలో కీలక నియోజకవర్గం గాజువాక…. వైజాగ్‌కే వన్నె తెచ్చిన ఉక్కు పరిశ్రమ ఉన్న ప్రాంతం… దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గం… ఓ విధంగా చెప్పాలంటే గాజువాక ఓ మినీ భారత్‌..

ఈ హాట్ సీట్ లోనే గత ఎన్నికల్లో జనసేనాని పవన్‌కు ఝలక్‌ ఇచ్చారు స్థానిక ఓటర్లు… చంటిగాడు లోకల్‌ అన్నట్లు స్థానిక నేతలకే పెద్దపీట వేసే గాజవాకలో ఈసారి రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌ వైసీపీ అభ్యర్థిగా, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరూ లోకలే… మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు? గాజువాకపై ఎగిరే జెండా ఏది?

ఈసారి ఇద్దరు మాస్ లీడర్ల ఫైట్..
ఉక్కు నగరం విశాఖలో గట్టి నియోజకవర్గం గాజువాక… స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, ఆటోనగర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌తో గాజువాక పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అంతేకాదు జాతీయ రహదారి పొడవునా విస్తరించిన ఈ నియోజకవర్గం ఆర్థికంగా రాష్ట్రానికి గుండె లాంటి ప్రాంతం.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులతోపాటు, ఆటోనగర్‌ పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఓట్లు ఎక్కువగా ఉండే గాజువాక నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మాస్‌ లీడర్లు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు.

ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ అభ్యర్థి గెలుపు..
2009లో ఏర్పడిన గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని 19 వార్డులలో విస్తరించింది. ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ అభ్యర్థి గెలిచారు. వరుసగా ఒకే పార్టీ అభ్యర్థి గెలవడం గాని, లేదా ఒకేపార్టీ రెండు ఎన్నికల్లో గెలవడం గాని ఇప్పటివరకు జరగలేదు. మెుత్తం మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్, గంగవరం పోర్టు, కోరమండల్, బిహెచ్‌సీఎల్ వంటి ప్రధాన సంస్థలు గాజువాకలోనే ఉన్నాయి.

భారీగా ఓట్లు చీల్చిన టీడీపీ..
ఇక్కడ యాదవ, కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెండు వర్గాలకే ప్రధాన పార్టీలు టికెట్స్‌ ఇస్తుంటాయి. రెడ్డిక, గవర, వెలమ ఇతర బీసీ సామాజికవర్గాలకు దాదాపు 20 వేల చొప్పున ఓటింగ్‌ ఉంది. ఈ లెక్కల ఆధారంగానే గత 3 దఫాలుగా ఇక్కడ అభ్యర్థులకు ప్రాధాన్యం లభించింది. పీఆర్పీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య గెలిస్తే.. 2014లో యాదవ నేత పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు. 2019లో త్రిముఖ పోటీలో వైసీపీ, జనసేన హోరాహోరీగా తలపడ్డాయి. జనసేనాని పవన్‌ పోటీ చేయగా, టీడీపీ భారీగా ఓట్లు చీల్చింది. దీంతో పవన్‌ సుమారు 16 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు.

తొలిసారిగా గాజువాక నుంచి పోటీ..
ప్రస్తుతం గాజువాకలో హోరాహోరీగా ఫైట్‌ జరుగుతోంది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తొలిసారిగా గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచే కార్పొరేటర్‌గా పనిచేసిన అమర్‌నాథ్‌, 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. ఈసారి మాత్రం ఆయనను గాజువాక నుంచే బరిలోకి దింపింది వైసీపీ.. గతంలో వీరి తల్లిదండ్రులు, ఇప్పుడు తనయులు తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలకూ రాజకీయ వారసత్వం ఉంది. వాస్తవానికి ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే అధికార పార్టీలో ఇప్పటికే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఓ ఇన్‌చార్జిని నియమించిన వైసీపీ.. కొద్దిరోజుల క్రితమే మంత్రి అమర్‌నాథ్‌ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన తరఫున ఒకరిద్దరి పేర్లు వినిపించినా, చివరికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరే ఖరారైంది.

ఇద్దరిదీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం..
పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇక గుడివాడ అమర్‌నాథ్‌ది పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తాత గుడివాడ అప్పన్న 1978లో పెందుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గం అప్పట్లో పెందుర్తి పరిధిలో ఉండేది. అమర్‌ తండ్రి గుడివాడ గురునాథరావు కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వారసుల్లో గెలుపు ఎవరిది?
గుడివాడ గురునాథరావు, పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం గతంలో ఒకరిపై ఒకరు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సింహాచలంపై గురునాథరావు 19 వేల 903 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పోటీలో ఉన్న ఇద్దరికీ బలమైన రాజకీయ, సామాజిక నేపథ్యం ఉండటంతో పాటు ఇద్దరూ స్థానికులే కావడం మరో విశేషం. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరు వారుసుల్లో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

గాజువాకలో పోరు ఎలా ఉన్న అభ్యర్థుల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇరు పార్టీలు ఇచ్చుకుంటూ వచ్చాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డి 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పవన్ కళ్యాణ్‌ పై పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ ఎన్నికల్లో పవన్‌ను ఓడించి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు నాగిరెడ్డి. కానీ, ఈ దఫా సీటు దక్కించుకోలేకపోయారు.

తొలుత టీడీపీ కార్పొరేటర్ గా అమర్నాథ్ విజయం..
ఇక తన తండ్రి గురునాథరావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన అమర్‌నాథ్‌ టీడీపీ నుంచి తొలుత కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆ తరువాత వైసీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపొయారు. 2019లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు అనుహ్యంగా గాజువాక టికెట్‌ దక్కించుకున్నారు. తన తాత తండ్రి మాదిరిగానే తనను ఆదరించాలంటూ ప్రచారంలో దుసుకుపోతున్నారు. అమర్ గాజువాక నియెజకవర్గంలో ఉన్న వివిధ సామాజిక వర్గాల నాయకులతో సమావేశాలు, చర్చలు ప్రచారాలతో బిజీబిజీ అయిపోయారు. అందరినీ కలుపుకునిపోయి మరోసారి గాజువాకలో వైసీపీ జెండా ఎగుర వేస్తామని అమర్ అంటున్నారు.

సౌమ్యుడు, వివాదరహితుడిగా గుర్తింపు..
ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, నియోజకవర్గంపైనా స్పష్టమైన ముద్ర వేశారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నా పల్లా శ్రీనివాసరావు.. ఒకానొకదశలో వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, అదంతా దుష్ప్రచారమే అని చెప్పుకొచ్చిన పల్లా… పార్టీ విధేయతతో టికెట్‌ దక్కించుకున్నారు. మాస్ లీడర్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న పల్లా.. ఈసారి గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలో జోరు చూపుతున్న పల్లా వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడకు గట్టి పోటీ ఇస్తున్నారు.

బీజేపీతో చేతులు కలపడం ద్వారా ఇరకాటంలో టీడీపీ..
హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రధాన అంశంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీకి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ తలనొప్పిగా మారగా, ఇప్పుడు బీజేపీతో చేతులు కలపడం ద్వారా టీడీపీ కూడా ఇరకాటంలో పడింది. స్టీల్‌ ప్లాంట్‌ ఓటర్ల తీర్పే గెలుపోటములను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇద్దరు నేతలకు స్టీల్‌ప్లాంట్‌ అంశం మింగుడుపడని విధంగా తయారైంది. ఈ సమస్యను అధిగమించిన వారే అంతిమ విజేతలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నుంచి ఓటర్ల దృష్టిని మళ్లించే సామర్థ్యం ఈ ఇద్దరి ఎవరికి ఉన్నదనేదే చర్చకు తావిస్తోంది. మొత్తానికి గాజువాకలో గెలుపు ఇద్దరికీ అంత ఈజీ కాదన్నదే పరిశీలకుల అభిప్రాయం.

Also Read : ఉమాబాల వర్సెస్ వర్మ.. నరసాపురంలో ఎవరి సత్తా ఎంత?

పూర్తి వివరాలు..