Tirumala Srivari Temple
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనాలు, గదుల కోటాను నేడు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించింది. అంగ ప్రదక్షిణ టోకెన్లను ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనుంది టీటీడీ. ఈ టికెట్లు పొందిన వారిలో.. ఈ నెల 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించిన వారికి లక్కీ డిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
ఇక సెప్టెంబర్ 22న ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అనంతరం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దాంతోపాటే తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు దళారులను నమ్మొద్దని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్.. https://ttdevasthanams.ap.gov.in లేదా యాప్ లోనే దర్శన, సేవల టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.