Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం ఉదయం 3 గంటల వరకు అంటే.. 12గంటల పాటు శ్రీవారి ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో దర్శనాలు ఉండవు.
ఆదివారం రాత్రి 9.50 గంటలకు ప్రారంభం చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆనవాయితీగా ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేయనున్నారు. అనంతరం పుణ్యహవచనం నిర్వహిస్తారు.
స్వామి వారికి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. సోమవారం 8వ తేదీ ఉదయం 6 గంటల నుండి భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఆదివారం తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూసి ఉంచుతారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ నిలిపివేస్తారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపిణీని పున: ప్రారంభించనున్నారు. గ్రహణం సమయంలో పురాతన పద్ధతులు ఆచరించాలని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.
గ్రహణం సమయంలో ఆహారం తీసుకోరాదని ఆయన సూచించారు. అలాగే ఇంట్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలపై దర్భ ఉంచాలన్నారు. గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరు స్నానాలు చేయాలని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు.