వరదాయిని చాముండేశ్వరి దేవి.. అమ్మవారిని అలంకరించి ఏనుగులపై ఊరేగించే సంప్రదాయం

ఈ ప్రాంతంలో మునులు, ఆధ్యాత్మిక సాధకులు తపస్సు చేశారని హిందువులు నమ్ముతారు. ఈ శక్తిపీఠానికి క్రౌంచపీఠం అనే పేరు కూడా ఉంది.

Chamundeshwari Devi

Chamundeshwari Devi: దక్షయజ్ఞం తర్వాత సతీదేవి కురులు పడిన కర్ణాటకలోని మైసూరులో అమ్మవారు చాముండేశ్వరిగా వెలిశారు. ఇక్కడ అమ్మవారు స్వర్ణ విగ్రహంగా దర్శనమిస్తారు.

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి చాముండేశ్వరి దేవాలయం. ఈ ప్రాంతంలో మునులు, ఆధ్యాత్మిక సాధకులు తపస్సు చేశారని హిందువులు నమ్ముతారు. ఈ శక్తిపీఠానికి క్రౌంచపీఠం అనే పేరు కూడా ఉంది. దేవీ మాహాత్మ్యంలో చాముండేశ్వరీ దేవి ప్రాశస్త్యం కూడా కనిపిస్తుంది. ఆ మందిరంలో గర్భాలయంతో పాటు నవరంగ ప్రాంగణం, అంతరాల మంటపం ఉంటాయి

మైసూర్ మహారాజుల కాలం నుంచి ఈనాటి వరకు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలకు 400ల ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత కన్నడ ప్రాంతం అంతా వడయార్ల అధీనంలోకి వెళ్లిపోయింది. మొట్టమొదటిసారిగా కీ.శ 1610 ప్రాంతంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. 1659లో ఆనాటి దొడ్డ దేవరాజు ఆలయాన్ని పునరుద్ధరించి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు.

అలా మొదలైన ఉత్సవాలు నేటికి కొనసాగుతున్నాయి. మైసూర్ మహారాజులు చాముండేశ్వరి దేవిని పూజిస్తూ కులదేవతగా ఆరాధించారు. కర్ణాటక సాంసృతిక రాజధానిగా మైసూరు నగరం నిలిచిపోయింది.

విజయదశమి వస్తుందంటే చాలు.. కర్ణాటక అంతటా పండగే. అందులోనూ మైసూర్ నగరం ఆ ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్‌. ఇక్కడ.. నాటి రాజుల కాలం నుంచి ఇప్పటివరకు.. అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ వేడుకలకు 400 ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఇక్కడి సందడి చూసేందుకు.. దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారంటే.. వేడుకలు ఏస్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహారాజు కులదైవమైన.. చాముండేశ్వరీ దేవిని అలంకరించి, ఆరాధించి.. ఏనుగులపై ఊరేగించడం ఇక్కడ సంప్రదాయం.

ఆ సమయంలో.. మైసూర్ ప్యాలెస్ ముందు నుంచి బన్నీమంటపం వరకు ఉండే వీధులన్నీ కోలాహలంగా మారిపోతాయి. ఈ వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు మాత్రమే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి. కళాకారుల ప్రదర్శనలు వాటిని ప్రతిబింబిస్తాయి.

మైసూర్ ప్యాలెస్ ప్రత్యేక అలంకరణతో వెలిగిపోతుంది. రాజుగారి ఆయుధపూజ, ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు, ఏనుగుల అలంకరణ.. ఇలా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. నవరాత్రుల్లో.. తొమ్మిదో రోజున మైసూర్ రాజవంశానికి చెందిన రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేయడం ఆకట్టుకుంటుంది. మొత్తంగా… ప్రతిఘట్టం, ప్రతిదృశ్యం కన్నుల పండువగా సాగుతుంది. అందుకే ఈ వేడుకలను చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇసుకేస్తే రాలనంత జనంతో ప్యాలెస్‌ కిటకిటలాడిపోతుంది.

దసరాకు ముందు 9రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్‌ లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మైసూర్ మహారాజుల నివాసం అయిన ఈ ప్యాలెస్‌లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్‌లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే పది రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు.