Karthika Somavaram: కార్తీక సోమవారం శివుడిని ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. కార్తీక సోమవారం శివు పూజకు ఉన్న గొప్పదనం గురించి పురాణాల్లో చెప్పారు. పరమేశ్వరుడికి ఏకాదశ రుద్ర రూపాలు ఉన్నాయి. 11 రూపాలలో పరమేశ్వరుడు ఈ భూ మండలాన్ని ఒకానొక సమయంలో రక్షించాడు. 11 రూపాలు ధరించాడు. అలా 11 రూపాల్లో బ్రహ్మాండాన్ని రక్షించిన రోజు కార్తీక సోమవారం.
అందుకే కార్తీక సోమవారం ఎవరైనా సరే రాహు కాలంలో శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకున్నా, శివాలయ ప్రాంగణంలో తీర్థం తీసుకున్నా, వాళ్లకి వందేళ్లు శ్రీశైలం క్షేత్రం యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది.. 11 సంవత్సరాలు కాశీ క్షేత్రంలో యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు తెలుపుతున్నాయి.
100 సంవత్సరాలు ప్రతి రోజు శ్రీశైలంలో యజ్ఞత చేసిన ఫలితం రావాలనుకుంటే, 11 సంవత్సరాలు కాశీలో ప్రతి రోజు యజ్ఞం చేసిన ఫలితం రావాలనుకుంటే.. జీవితంలో ఒక్కసారి కార్తీక మాసంలో సోమవారం పూట రాహు కాలంలో అంటే ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి. లేదా శివాలయంలో రాహు కాలంలో శివుడికి కార్తీక సోమవారం మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. రాహు కాలంలో శివాలయంలో తీర్థం తీసుకోండి. ఫలితం మొత్తం ఏకకాలంలో పొందొచ్చు. అంతటి శక్తి కార్తీక సోమవారానికి ఉంది.
కార్తీక సోమవారం శివుడికి ఒక అద్భుతమైన పుష్పం సమర్పిస్తే ఈ లోకంలో సర్వ సంపదలు కలుగుతాయి, శరీరం విడిచి పెట్టాక మోక్షం కూడా వస్తుంది. ఆ అద్భుతమైన పుష్పం ఏంటంటే జిల్లేడు పుష్పం. కార్తీక సోమవారం శివుడికి జిల్లేడు పూలతో పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
కార్తీక సోమవారంలో లేదా కార్తీక మాసంలో ఎప్పుడైనా జిల్లేడు పుష్పాలతో శివుడిని పూజిస్తే పరిపూర్ణమైన ఆయుష్షు కలుగుతుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా లభిస్తుంది.
కార్తీక సోమవారం చేయాల్సిన అద్భుతమైన అభిషేకం కుశోదకం. కుశలు అంటే దర్భలు. నీళ్లలో దర్భలు వేసి ఆ నీటితో కార్తీక సోమవారం రోజున శివుడికి అభిషేకం చేస్తే తిరుగులేని ఐశ్వర్యం ఇస్తాడని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అలాగే పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ అభిషేకం చేసుకోవచ్చు. అన్నింటికంటే గొప్పది కుశోదకం. దర్భ జలాలతో చేసే అభిషేకం.
అలాగే కార్తీక సోమవారం నక్తం ఉండండి. నక్తం అంటే రాత్రి. లేదా రాత్రి భోజనం. కార్తీక సోమవారం పగలు శివుడిని పూజించాలి. పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. వండిన అన్నం తినకూడదు. సాయంకాలం శివాభిషేకం కానీ శివ పూజ కానీ చేసుకుని ఆకాశంలో నక్షత్రం చూడాలి. ఆ తర్వాత శివుడికి అన్నం నైవేద్యం పెట్టి.. దాన్నే ప్రసాదంగా తినాలి. అంటే కార్తీక సోమవారం ఉదయం అన్నం తినకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్రం చూసి ఆహారం తింటే దాన్ని నక్తం అంటారు. నక్తం అంటే రాత్రి లేదా రాత్రి భోజనం అని అర్థం. ఇది ఉంటే పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లా కాలిపోతాయి. నక్తం చాలా గొప్పది.
మరి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు, ఉపవాసం ఉండలేని వాళ్లు, డయాబెటిక్ పేషెంట్స్.. అలాంటి వాళ్లు ఏం చేయాలంటే.. ఛాయా నక్తం ఉండొచ్చు. ఛాయా నక్తం అంటే మధ్యాహ్నం 12 గంటల సమయం. అనారోగ్యం వల్ల తినకుండా ఉండలేము అనుకునే వారు కార్తీక సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమీ తినొద్దు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదైనా తినండి. దీన్ని ఛాయా నక్తం అంటారు. ఇది ఉన్నా శివానుగ్రహం సంపూర్ణంగా పొందుతారు.