నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనపడే శక్తిపీఠం.. జోగులాంబ ఆలయ విశిష్టత తెలుసుకోవాల్సిందే

కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు.

Jogulamba Devi Temple

Jogulamba Devi Temple: దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడిన ప్రదేశం ఇది. తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూరులో జోగులాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది.

బ్రహ్మదేవుడి ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉంటాయి. ఇక్క కూడా ఒకటి ఉంది. ఇక్కడ కొలువైన నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన జోగులాంబను పూజిస్తుంటారు. (Jogulamba Devi Temple)

బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ఆలంపూర్‌.. నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. బ్రహ్మ తొమ్మిది వేర్వేరు రూపాలలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు.

క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉంది.. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కి ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్రా నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు.

సకలపాప నివారినిగా ఈ నదిని కొలుస్తారు. అమ్మవారి దర్శనానికి ముందు ఈ నదిలో స్నానం చేసి పవిత్రులుగా వెళ్తారు. ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ… దాని రెండోవైపు చుట్టూ అలుముకున్నట్లుగా ఉన్న నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నదిలో కోరిన కోర్కెలు తీర్చాలని దీపాలు వదులుతారు భక్తులు.

కృష్ణా, తుంగభద్ర పుష్కరాల సమయంలో అలంపూర్‌.. భక్తులతో కిటకిటలాడుతుంది. శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తుంది.

కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, శివరాత్రి పర్వ దినాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక్కడ వర్ణార్చన, కన్యా పూజల కోసం మహిళలు తరలి వస్తారు.