సంతానం, విద్యను ప్రసాదించే కామాక్షీదేవి.. ఈ పీఠాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు..

కామాక్షి అమ్మవారిని పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఐశ్వర్యం, జ్ఞానం, ఆరోగ్యం చేకూరుతాయని నమ్మకం.

Kamakshi Devi Shakti Peeth

Kamakshi Devi Shakti Peeth: విష్ణువు ఖండించిన తర్వాత సతీదేవి శరీరభాగమైన “కంకాళం” పడిన ప్రాంతమే కాంచీపుర క్షేత్రమైంది. ఈ పీఠంలో అమ్మవారు చెరకు గడ, పాశాంకుశాలు, భుజంపై చిలుకతో పద్మాసన భంగిమలో ఉంటారు.

ఇక్కడ అమ్మవారిని కామాక్షీ అమ్మన్‌ అంటారు. తమిళనాడు రాజధాని చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.

కామాక్షీ అమ్మవారి మహిమ
“కామ” అంటే కోరికలు, “అక్షి” అంటే చూపు. భక్తుల కోరికలను తన దయతో తీర్చే తల్లి కావడం వల్లే అమ్మవారికి ఈ పేరు వచ్చింది. కామాక్షి అమ్మవారిని పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఐశ్వర్యం, జ్ఞానం, ఆరోగ్యం చేకూరుతాయని నమ్మకం. ఈ పీఠాన్ని దర్శిస్తే దుఃఖాలు తొలగిపోయి, సంతానం, విద్యాభివృద్ధి లభిస్తాయని చెబుతారు.

ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపంగా మాత్రమే కాకుండా కరుణ, శాంతి, జ్ఞానానికి ప్రతీకగా పూజిస్తున్నారు. పురాతన కాలంలో పాండ్యులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

కాంచీ కామాక్షి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అమ్మన్/దేవి ఆలయాలలో ఒకటి. కామాక్షి అమ్మన్ ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ ఏకాంబరనాథర్ ఆలయం, శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, శ్రీ ఉలగలండ పెరుమాళ్ ఆలయం, శ్రీ కుమారకొట్టం ఆలయం, శ్రీ కైలాసనాథర్ ఆలయం, శ్రీ కచపేశ్వరర్ ఆలయాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ప్రధాన దేవత కామాక్షి (పార్వతీ దేవి దివ్యరూపం). అమ్మవారి నుదిటిపై చంద్రపెరై (అర్ధచంద్రాకారపు అలంకారం) ఉంటుంది. శ్రీ ఆది శంకరాచార్యులు ప్రధాన దేవత ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రం అంటే ఆదిశక్తి శక్తిని ప్రతిబింబించే యంత్రం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాంచీపురంలో వేరే పార్వతీ ఆలయం లేదు.