Medaram Jatara Representative Image (Image Credit To Original Source)
Medaram Jatara: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర.. తెలంగాణ మహా కుంభమేళా.. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో కోలాహలంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు (28, 29, 30, 31 తేదీల్లో ) జరగనుంది. అటవీ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారింది. కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వన దేవతలు (సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు) గద్దెలపై కొలువుదీరారు. దీంతో మేడారంలో ఆధ్యాత్మిక కోలాహలం వెల్లివిరిసింది.
పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు, కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం చేరుకుని గద్దెలను ఎక్కడంతో జాతర ప్రారంభమైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు జనం పోటెత్తారు. అన్ని దారులు మేడారం వైపే.
మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. తల్లుల దర్శనం కోసం మేడారానికి నలువైపుల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అడవిలో విడిది చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఇక్కడ ఆనవాయితీ.
కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు గద్దెపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను తీసుకొచ్చి మేడారం గద్దెల ప్రాంగణంలో పూజారులు ప్రతిష్ఠించారు.
ఇక జాతరలో అత్యంత కీలక ఘట్టం గురువారం నాడు జరిగే సమ్మక్క ఆగమనం. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకోనున్నారు. చిలుకలగుట్టపై నుంచి కుంకుమభరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు గద్దెపైకి తెచ్చే సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. శుక్రవారం నాడు భక్తులు దేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వన ప్రవేశంతో ఈ మహాక్రతువు ముగుస్తుంది.
మేడారం మహా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రఖ్యాతి గాంచింది. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల జరిగే ఈ పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకుంటారు.