Ganapathi Prasad: వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాలు ఇవే.. చేసే పద్ధతి..

చవితి ఉత్సవాల్లో రకరకాల వినాయక విగ్రహాల తర్వాత.. అత్యంత ముఖ్యమైనవి ప్రసాదాలే. పండుగ వేళ.. ఆయనకు ఇష్టమైన... (Ganapathi Prasad)

Ganapathi Prasad: వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాలు ఇవే.. చేసే పద్ధతి..

Updated On : August 25, 2025 / 6:29 PM IST

Ganapathi Prasad: వినాయకచవితి వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా పండుగను జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తారు. గణపతిని భోజన ప్రియుడు అని కూడా అంటారు. అందుకే, చవితి రోజున బొజ్జ గణపయ్యకు ఇష్టమైన వంటకాలను వండి పెట్టి ఆ వినాయకుడి ఆశీస్సులు పొందాలని భక్తులు ఆశిస్తారు.

పూజ ఎంత నిష్టగా చేస్తారో, ప్రసాదాలూ అంతే నిష్టగా చేస్తారు. ఇంతకీ వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాలు ఏవి, అవి చేసే విధానం ఏంటి.. ఇప్పుడు తెలుసుకుందాం..

చవితి ఉత్సవాల్లో రకరకాల వినాయక విగ్రహాల తర్వాత.. అత్యంత ముఖ్యమైనవి ప్రసాదాలే. పండుగ వేళ.. ఆయనకు ఇష్టమైన ప్రసాదాలు చేస్తారు భక్తులు.

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాళికలు, పాయసం, చింతపండు పులిహోర. వీటిని ఎలా చేయాలో, కావాల్సిన పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1) ఉండ్రాళ్లు..

పచ్చి శనగపప్పు – పావు కప్పు (అరగంట నాన బెట్టుకోవాలి)
బియ్యం రవ్వ – ఒక కప్పు
నెయ్యి – రెండు టీ స్పూన్లు
జీలకర్ర – తగినంత
పచ్చికొబ్బరి- సన్నగా తరిగింది

* బియ్యం రవ్వ దోరగా ఫ్రై చేసుకోవాలి.
* పాన్ లో నెయ్యి వేయాలి.
* నెయ్యి కరిగాక జీలకర్ర, పచ్చికొబ్బరి వేయాలి. దోరగా ఫ్రై చేయాలి.
* అందులోనే నీరు లేకుండా పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేయాలి.
* అందులోనే రెండున్నర కప్పుల నీరు పోయాలి.
* మరుగుతున్నప్పుడు ఉప్పు వేయాలి.
* శనగపప్పు ఉడికాక రవ్వ వేయాలి. రవ్వని ఉడకనివ్వాలి.
* తర్వాత కాసేపు చల్లారనివ్వాలి.
* దీనిని లడ్డూల్లా చేయాలి.
* ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కి కొద్దిగా నెయ్యి రాసి అందులో బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు వేయాలి.
* 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
* బియ్యం నూక ఉండ్రాళ్ళు రెడీ.

2) చింతపండు పులిహోర:

కప్పు బియ్యం
కొద్దిగా చింతపండు
ఒక స్పూన్ పసుపు
3 స్పూన్స్ పల్లీలు
ఒక స్పూన్ ఆవాలు
ఒక స్పూన్ శనగపప్పు
ఒక స్పూన్ జీలకర్ర
4 ఎండు మిరపకాయలు
తగినంత నూనె, ఉప్పు
4 పచ్చిమిర్చి
ఒక స్పూన్ మిరియాలు
తగినంత కరివేపాకు

* ముందుగా వేడి నీళ్లలో చింతపండు నానబెట్టాలి.
* బియ్యాన్ని కడగాలి. కాసేపు నాననివ్వాలి.
* అన్నం మెత్తగా కాకుండా కొంచెం పొడిపొడిగా వండాలి.
* పెద్ద గిన్నెలో చింతపండు రసం, కొన్ని నీళ్లు, పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె పోయాలి.
* చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.
* కడాయిలో నూనె పోసి ఆవాలు, శనగపప్పును వేయించాలి.
* ఇందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగనిచ్చి ప్లేట్​లోకి తీసుకోవాలి.
* పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఉడికించిన అన్నం, కొద్దిగా నూనె, కొంచెం పసుపు వేసి ముందుగా కలుపుకోవాలి.
* అన్నంలో ఉడికించిన చింతపండు రసం, ఉప్పు తగినంత వేసుకుని మరొకసారి కలుపుకోవాలి.
* నూనెలో వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకును అన్నంలో వేసి బాగా కలపాలి.
* అంతే పులిహోర నైవేద్యం రెడీ..

3) బెల్లం కుడుములు..
గణపయ్యకు ఆవిరి కుడుములు అంటే ఎంతో ఇష్టం. అందుకే.. వినాయక చవితి రోజున ప్రతి ఇంట్లో తప్పకుండా కుడుములు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. బెల్లంతో చేసే కుడుములను స్వామి ఇష్టంగా స్వీకరిస్తాడని చెబుతారు. వాటి తయారీ విధానం, కావాల్సిన పదార్ధాలు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:
ఒక కప్పు బెల్లం
ఒక కప్పు తడి బియ్యం పిండి
2 స్పూన్ల పచ్చి కొబ్బరి
ఒక స్పూన్ యాలకుల పొడి
2 స్పూన్ల పచ్చి శనగపప్పు
2 కప్పుల నీళ్లు

తయారీ విధానం:

* నీళ్లలో పచ్చి శనగపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
* ఇందులోకి తరిగిన బెల్లం వేసుకుని కరిగించుకోవాలి.
* కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి పాకం చిక్కగా మార్చుకోవాలి.
* ఇందులోకి బియ్యం పిండి వేసి ముద్దగా మారేంత వరకు కలుపుకోవాలి.
* పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కుడుములు చేసుకోవాలి.
* వీటిని 10 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి.
బొజ్జ గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు రెడీ.

4) పాలతాళికల తయారీకి కావాల్సిన పదార్ధాలు:

ఒక కప్పు బియ్యం పిండి
ఒకటినర్న కప్పు నీళ్లు
4 కప్పుల పాలు
ఒక కప్పు బెల్లం తురుము
అర స్పూన్ యాలకుల పొడి
4 స్పూన్ల నెయ్యి
10 జీడిపప్పులు
10 ఎండుద్రాక్ష
10 బాదం
చిటికెడు ఉప్పు

తయారీ విధానం:
* పాల తాళికల కోసం పిండిని రెడీ చేసుకోవాలి.
* గిన్నెలో కప్పున్నర నీటిని వేయాలి.
* అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా మరిగించాలి.
* ఆ వేడి నీటిలో బియ్యం పిండి వేస్తూ ముద్దలు పట్టకుండా కలుపుతూ బియ్యం పిండిని జోడించాలి.
* అలా బియ్యం పిండిలోని నీరు ఇంకే వరకూ తక్కువ మంట మీద ఉడికించాలి.
* 2 స్పూన్ల నెయ్యి, కొంచెం పంచదార వేసి బియ్యం పిండి బాగా కలపాలి.
* బియ్యం పిండి కొంచెం చల్లారబెట్టి.. ఒక ప్లేట్ బియ్యం పిండిని వేసి మొత్తగా చేయాలి.
* బియ్యం పిండిని సన్నగా పొడవుగా రోల్ చేయాలి.
* పిండి పూర్తిగా సన్నగా పొడవుగా చుట్టేయాలి.
* గిన్నెలో పాలు వేసి మరిగించాలి.
* అందులో తాళికలు వేసి.. వేడిని తగ్గించి.. పాల తాళికలు మెత్తగా అయ్యేవరకు 20 నిమిషాలు ఉడికించాలి.
* తర్వాత అందులో బెల్లం తురుము లేదా పంచదార వేసి మెల్లగా కరిగే వరకూ కదిలించాలి.
* తర్వాత యాలకుల పొడిని జోడించాలి.
* నెయ్యిని వేడి చేసుకోవాలి.
* అందులో బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించాలి.
* ఇప్పుడు నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ ని పాల తాళికల్లో జోడించాలి.
అంతే పాల తాళికలు రెడీ..

5) పాయసం… కావాల్సిన పదార్ధాలు..

సేమియా – ఒక కప్పు
చక్కెర – పావు కప్పు
యాలకులు
అర లీటర్ పాలు
నెయ్యి – 2 స్పూన్లు
డ్రై ఫ్రూట్స్- సన్నగా తరగాలి

తయారీ విధానం..

* ముందుగా నెయ్యిని వేడి చేసుకోవాలి.
* డ్రైఫ్రూట్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
* నెయ్యి, సేమియా వేసి చిన్న మంటపై ఫ్రై చేసుకోవాలి.
* పాన్‌లో నీరు పోసి అందులోనే సేమియా ఉడకనివ్వాలి
* తర్వాత పంచదార, పాలు వేయాలి.
* చివరగా యాలకులు, డ్రైఫ్రూట్స్ కలపాలి.

6)మోదకాలు.. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో మోదకాలు ఒకటి..

కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం..

పచ్చి కొబ్బరి – 100 గ్రాములు (తురిమినది)
బెల్లం తురుము – 100 గ్రాములు
నెయ్యి – టీ స్పూన్
బెల్లం కరిగి దగ్గరికి చేరేవరకు ఉడికిస్తే చాలు
యాలకుల పొడి, జాజికాయ పొడి చల్లి కలిపి చల్లార్చాలి
కప్పు నీరు మరిగించుకోవాలి
చిటికెడు ఉప్పు వేసుకోవాలి
ఒక కప్పు పొడి బియ్యం పిండి, కొద్దిగా నెయ్యి వేసి గరిటెను తిప్పాలి
పిండిని రౌండ్ గా చేసుకోవాలి
మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
మోదక్ మోల్స్ తీసుకోవాలి, కొద్దిగా నెయ్యి పూయాలి
చిన్న పిండి ముద్దను మోదక్ మోల్ లో పెట్టుకోవాలి
ఆ తర్వాత పిండి ముద్ద సైజులో కొబ్బరి ముద్ద తీసుకోవాలి
తర్వాత కొంచెం బియ్యం పిండి ముద్ద తీసుకుని పైన కవర్ చేయాలి
తర్వాత నెయ్యి రాసిన పల్లెంపై పెట్టుకోవాలి
ఆవిరి మీద 10 నుంచి 12 నిమిషాలు ఉడికించాలి
అంతే.. మోదకాలు రెడీ..

Also Read: గణేశ్ చతుర్థి ఆగస్టు 26ననా? లేక ఆగస్టు 27ననా? పూజ ముహూర్తం, తేదీ, సమయం వివరాలు..