Karthika Masam: కార్తీక మాసంలో 19వ రోజుకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి తెలుసుకుందాం. ఏ కథను వినడం ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..
కార్తీక మాసంలో 19వ రోజు.. నవంబర్ 9న.. స్నానం చేసేటప్పుడు గణపతి షోడసి నామాలు చదువుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు అవిస పువ్వుని నీళ్లలో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి. మనసు నిలకడ ఏర్పడుతుంది. అవిస పువ్వు దొరక్కపోతే మారేడు దళం నీళ్లలో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అది కూడా అందుబాటులో లేకపోతే కొద్దిగా పసుపు, ఆవు పాలు నీళ్లలో కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి. దీని వల్ల చంచలత్వం తగ్గి మనసు నిలకడగా ఉంటుంది.
అవిస పుష్పాలు లేదా మారేడు దళాలతో శివపూజ చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు. శివానుగ్రహం వల్ల సమస్త సుఖాలు తొందరగా చేకూరతాయి. శివుడికి అటుకులు, బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి.
కార్తీక మాసం 19వ రోజు..ఆదివారం అయ్యింది. కాబట్టి వృత్తి పరంగా ప్రమోషన్లు పొందటానికి అందరూ ఇంట్లో బెల్లం దీపం వెలిగించుకోవాలి. తండ్రి వైపు ఆస్తులు రావాలన్నా, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా రావాలన్నా.. రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా ఇంట్లో పూజ గదిలో బెల్లం దీపం వెలిగించుకోవాలి. రాగి లేదా ఇత్తడి పళ్లెం తీసుకోవాలి. దానికి 5 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. అందులో మూడు గుప్పిళ్ల బియ్యం పోసి తమలపాకులు ఉంచి, వాటి మీద చతురస్రాకారంలో ఉన్న బెల్లం ముక్కను ఉంచాలి. ఆ బెల్లం ముక్క మీద కూడా తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఆ బెల్లం ముక్క పైభాగాన్ని కొద్దిగా రంధ్రంలా చేసి తీసేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి అక్కడ పువ్వొత్తులు రెండు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే బెల్లం దీపం అంటారు.
ఆ బెల్లం దీపం దగ్గర గోధుమ రవ్వతో చేసిన పదార్ధాం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారో వారంతా సూర్యుడి అనుగ్రహం వల్ల ప్రమోషన్లు తొందరగా పొందుతారు. తండ్రి వైపు ఆస్తులు తొందరగా వస్తాయి. రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. పరపతి, హోదా, గౌరవం అత్యుత్తమ స్థాయిలో రావడానికి ఈ బెల్లం దీపం విశేషంగా సహకరిస్తుంది. ఆ బెల్లం దీపం కొండెక్కాక.. ఆ బియ్యంతో పొంగలి చేసుకుని ఇంట్లో నైవేద్యంగా సూర్యుడికి సమర్పించి కుటుంబసభ్యులు అంతా ప్రసాదంగా తీసుకోవాలి. కొండెక్కిన బెల్లం దీపం మాత్రం ఎవరూ తొక్కని చోట చోట చెట్టు మొదట్లో వేయాలి.