Pitru Paksha 2025: భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది. పక్షం అంటే 15 రోజులు. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది. ఈ నెల 21వ తేదీన మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షాలను మహాలయపక్షాలు అని కూడా పిలుస్తారు. ఆయా తిథుల్లో మరణించిన వారికి ఆరోజున మహాలయం పెట్టాలని పెద్దలు చెబుతారు.
పితృపక్షంలో పితృ దేవతలకు అర్చన చేస్తారు. పితృ దేవతలకు ఏ చిన్న పుణ్య కార్యం చేసినా చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చే సమయం మహాలయం. పితృపక్షాలు.. మరణించిన పెద్దలకు చాలా ప్రియమైన రోజులు. ఈ రోజుల్లో మీ వంశంలో చనిపోయిన పెద్దలకు తర్పణాలు వదలడం, పిండాలు పెట్టడం, వారి పేరు మీద దానాలు ఇచ్చుకోవటం ఫలితాన్ని ఇస్తుంది.
మీ వంశానికి పితృ దోషాలు, పితృ శాపాలు లేకుండా అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతారు. భాద్రపద బహుళ పక్షాలనే పితృపక్షాలు లేదా పెద్దల రోజుగా పిలుస్తారు. ఈ పితృపక్షాలలో మన పెద్దలకు, పూర్వీకులకు తర్పణాలు వదిలి వారి ఆశీస్సులు పొంది పితృ రుణం తీర్చుకోవచ్చు.
పితృపక్షం అంటే పితృదేవతలను స్మరించే సమయం. ఈ సమయంలో పితృదేవతల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. తర్పణాలు వదులుతారు. ఇలా చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం. పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశం వృద్ధి చెందుతుందని విశ్వాసం. 15 రోజుల పాటు వారి తిథుల ప్రకారం తర్పణాలు వదులుతారు.
పితృపక్షంలో నల్ల నువ్వులు నీళ్లలో కలిపి పితరులకు తర్పణం పెట్టే ఆచారం ఉంది. అలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలుగుతుందని చెబుతారు. ఈ 15 రోజులు మన పితరులు భూమిపై సంచరిస్తారని, ఈ నేపథ్యంలో పితృపక్షాలు నిర్వహిస్తారని పండితులు వివరించారు. పితృపక్షంలో ఇలా చేయటం వల్ల వంశవృద్ధి జరుగుతుందని నమ్ముతారు.
పితరులకు శ్రాద్ధకర్మలు చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, వారసులని ఆశీర్వదిస్తారని నమ్మకం. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈ పక్షంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పితృపక్షాల్లో బ్రాహ్మణులు, పేదలకి దానం చేయాలి. శక్తి మేరకు దానం చేయాలి.
Also Read: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఈ రాశుల మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం..! చేయాల్సిన పరిహారాలు..!