×
Ad

రాహుకేతుగ్రహ సమస్యలు: అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న వేళ ఒక్కసారిగా భయంకర ప్రాబ్లమ్స్‌

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

Kaal Sarp Dosh

Kaal Sarp Dosh: రాహుకేతుగ్రహ సమస్యలు భయంకరంగా ఉంటాయి. రాహుకేతువులని ఛాయాగ్రహమని, కార్మిక ప్లానెట్లని అంటారు. రాహువుని డ్రాగన్స్ హెడ్ (DRAGON’S HEAD) అని కేతువును డ్రాగన్స్ టైల్ (DRAGON’S TAIL) అని చెబుతారు.

ఈ రాహుకేతువులను శాడో ప్లానెట్లు (SHADOW PLANETS) అని అంటారు. రాహుకేతువులు రెండు ఛాయాగ్రహాలు.. రెండింటి ప్రవర్తనా ప్రభావం కుడి ఎడంగా ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఒకరు తల అయితే మరొకరు తోక గనుక. కొందరు వాటిని భూమి తాలూకు ఛాయలుగానే పరిగణిస్తారు.

ఉత్తరధ్రువ ఛాయను రాహువనీ, దక్షిణ ధ్రువఛాయను కేతువనీ అంటారు. రాహుకేతువుల ప్రభావము మానవ జీవితంపై ప్రభావము చూపుతుంది. ముఖ్యంగా రాహువు గురించి చెప్పాలంటే చంద్రుడు రాహువు నుంచి ఎంత దూరము ఉన్నాడో లెక్కించి దానిని లగ్నానికి కలపండి. ఈ లబ్ధము మంచి భావాలలో పడటం వల్ల మంచి ఫలితాలను రాహువు ప్రసాదిస్తాడు. ఈ లబ్దము 6,8,12 భావాలలో పడితే మంచి జరగదు.

రాహుగ్రహము

రాహువు అంటే అనుకోకుండా అడ్డంపడేవాడు. అంతా సజావుగా సాగిపోతోంది కాదా అని సంతోషించేలోపే ఆపదలు వస్తాయి. కాలప్రవాహాన్నికి ఎదురీదే శక్తి మానవునికి లేదు. మానసికంగా ఏ సమస్యలూ లేవనప్పుడు అర్ధాంతరంగా ‘సడన్ బ్రేక్’ వేసేవాడు రాహువు. జాతక చక్రంలో రాహువు సక్రమంగా లేకపోతే కొన్ని నిమిషాలలోనే ఓడలు బళ్లవుతాయి.

ఒక్కపూటలో పువ్వులమ్మిన చోట కట్టెలమ్మాల్సి వస్తుంది. కోరికలు తీరటంలో తాత్సారము, మందకొడితనం, ఏ పనులూ సాగకపోవటము, కడుపు భాగానికి సంబంధించిన వ్యాధులు, ఊపిరి తిత్తులు, చర్మరోగాలు, పాముకాటుకు గురి అవటం వంటి ఆపదలను రాహువు కలిగిస్తాడు. మానసిక సమస్యలు, పొత్తికడుపు భాగములో బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ జీవితంలో చిక్కులు, చికాకులు వృత్తి ఉ ద్యోగాలలో ఒడుదుడుకులు భార్యభర్తల మధ్య కీచులాటలు, బతుకంతా చీకూ, చింతా చీకటే తప్ప మరొకటి ఉండదు.

జాతక చక్రంలో రాహువు గనక బలంగా ఉంటే (చెడుగా) మనిషికి రోగాలు తప్పవు. న్యాయవాద వృత్తిలో రాణించలేక, కోర్టు వ్యవహారాలలో నెగ్గలేక, రాజకీయరంగంలో చిక్కులు, చట్టవ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు చేయటము, ప్రభుత్వశాఖలలో పనులు పూర్తికాక పోవటము, తరుచూ ప్రమాదాలు, వ్యాపారంలో నష్టాలు, జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉండటం. విధిబలమైనది.. మానవుడు బలహీనమైనవాడు.

కేతుగ్రహము

కేతుగ్రహము వల్ల విచారము కలగటం, దరిద్రము, సంతాననష్టము, ధైర్యం లేకపోవటము, ప్రేతాత్మల వలన బాధలు, సంక్షోభాలు కలగడం, కోర్టులకు వెళ్లడం, జైళ్లల్లో శిక్షలు అనుభవించడము వంటివి వస్తాయి. అంతుపట్టని రోగాలు, అనుకోని ప్రమాదాలు, కనిపించని శత్రువులు, వ్యసనములకు బానిసలు కావటము, గుర్రాలు, పేకాట, షేర్ మార్కెట్లలో నష్టము జరుగుతాయి. తరుచూ జ్వరాలు, కంటిబాధలు, చర్మ రోగాలు, మలబద్ధకము, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956