Total Lunar Eclipse 2025: ప్రతి సంవత్సరం రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు ఉంటాయి. అది చాలా సాధారణం. సెప్టెంబర్ 7న రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవించనుంది. గ్రహణం.. ఖగోళానికి సంబంధించిన అంశమే కాదు.. భారతీయ సంస్కృతి, జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
గ్రహణాల విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు, ఎన్నో అపోహలు, మరెన్నో భయాలూ ఉంటాయి. ముఖ్యంగా హిందువులకు నమ్మకాలు ఎక్కువ. గ్రహణ సమయాన్ని అశుభకరంగా పరిగణిస్తారు. ఆ సమయంలో కొన్ని తప్పకుండా చేయాల్సిన పనులు ఉంటాయి, మరికొన్ని అస్సలు చేయకూడని పనులు ఉంటాయి. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు, చేయాల్సినవి చేయకూడనివి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* చంద్ర గ్రహణం సమయంలో ధ్యానం చేయాలి. లేదా మంత్రాలను జపించాలి.
* ఈ సమయంలో దైవ నామ స్మరణ చేయడం శుభప్రదమైనది.
* గ్రహణం సమయంలో విష్ణువు, శివుడు లేదా హనుమంతుడి మంత్రాలను జపించాలి.
* గ్రహణం సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
* గ్రహణం వీడాక అన్ని వస్తువులపై గంగా జలాన్ని చల్లి వాటిని శుద్ధి చేయాలి.
* గ్రహణం వీడాక దానం చేయాలి.
* చంద్ర గ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం శుభప్రదం.
* అవసరమైన వారికి పాలు, బియ్యం, చక్కెర దానం చేయాలి.
* ఇంట్లోని అన్ని వస్తువులపై దర్భలను లేదా తులసి దళాలను ఉంచుకోవాలి.
* గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉండేందుకు వాటిపై దర్భ లేదా తులసి ఆకులను ఉంచాలి.
* వీటిలో ప్రతికూల శక్తులను గ్రహించే శక్తి ఉంటుందని నమ్ముతారు.
* గ్రహణం సమయంలో మానసికంగా బలంగా ఉండేందుకు భక్తి మార్గంలో వెళ్లాలి.
* గురువు ఇచ్చిన మంత్రోపదేశం లేదా పూర్వీకులు ఇచ్చిన ఆరాధన ఏదో ఒకటి తప్పకుండా చేసుకోవాలి.
* ఇంట్లోనే దేవుడి ముందు కూర్చుని ధ్యానం లేదా జపం చేసుకోవచ్చు.
* మంత్రం కూడా చదువుకోవచ్చన్నారు. దీని వల్ల మానసిక బలం ఏర్పడుతుంది. మనసులో నెగిటివిటీ తొలిగిపోతుంది.
* గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయాలి.
* శుభ్రమైన దుస్తులు ధరించాలి.
* ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
* గ్రహణ సమయంలో వాడిన వస్తువులను, వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి.
* గ్రహణం సమయంలో పూజలు చేయొద్దు.
* ఆర్థికపరమైన లేదా భావోద్వేగపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు.
* ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు.
* భావోద్వేగానికి గురికావద్దు.
* గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు, తాగకూడదు. (వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు)
* ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు.
* వంట చేయకూడదు.
Also Read: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది..
ఈ చంద్ర గ్రహణం భారత్ లోనూ కనిపిస్తుందని, గ్రహణ ప్రభావం మన దేశంపైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి, ఈ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం..
* గర్భిణీలు నేరుగా గ్రహణానికి గురికాకూడదు.
* ఆ సమయంలో బయటకు వచ్చి గ్రహాణాన్ని చూడకపోవడమే మంచిది.
* గ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు.
* గ్రహణ కిరణాలు పిండంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నమ్ముతారు.
* ఇంటి కిటికీలు, తలుపులు కూడా మూసి ఉంచాలి.
* గ్రహణం సమయంలో గర్భిణులు పదునైన వస్తువులు (కత్తెర, కత్తి, సూది వంటివి) తాకకూడదు, వాడకూడదు.
* గ్రహణం ప్రారంభం కావడానికి ముందే భోజనం చేయాలి.
* గ్రహణం సమయంలో దైవనామ స్మరణ, మంత్ర జపం చేయడం మంచిది.