Total Lunar Eclipse: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది. భాద్రపద పౌర్ణమి రోజున.. అంటే ఆదివారం సెప్టెంబర్ 7న రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. బ్లడ్ మూన్ వస్తుందంటే ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఏదో జరిగిపోతుందని అంతా భయపడతారు. కానీ అలాంటిదేమీ లేదని పండితులు చెబుతున్నారు. ఇక, ప్రతి సంవత్సరం రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు ఉంటాయి. అది సర్వ సాధారణం.
ఈ ఏడాదిలో ఇది రెండవ, చివరి చంద్ర గ్రహణం. ఈ చంద్ర గ్రహణం మన దేశంలో కూడా కనిపించనుంది. సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ఖగోళ అద్భుతంగా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. ఇక, ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ గ్రహణం విశేషమైన ప్రాముఖ్యత కలిగుందని పండితులు చెబుతున్నారు.
చంద్ర గ్రహణం గురించి ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. అసలు గ్రహణం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది, సంపూర్ణ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, గ్రహణం ఎన్ని గంటలకు ముగుస్తుంది? ఈ సమయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఆదివారం రాత్రి 9.58 గంటలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 11.42 గంటలకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. తెల్లవారుజామున 1.26 గంటలకు గ్రహణం ముగుస్తుంది. దాదాపు 3 గంటల 48 నిమిషాల కాలం గ్రహణం సమయం నడుస్తుంది. దీన్ని రాహు గ్రస్త చంద్ర గ్రహణం అని కూడా అంటారు. రాహువుతో చంద్రుడు కలిసినప్పుడు ఉద్భవించినటువంటి చంద్ర గ్రహణం కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రం ఉన్న వారు మంత్ర జపం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
గ్రహణం సమయంలో మానసికంగా బలంగా ఉండేందుకు, మన మనసు నుంచి నెగిటివిటీ తీసేందుకు, భయాలను తొలగించుకునేందుకు భక్తి అనే మార్గంలో వెళ్లాలని పండితులు సూచించారు. గురువు ఇచ్చిన మంత్రోపదేశం లేదా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆరాధన ఏదో ఒకటి తప్పకుండా చేసుకోవాలన్నారు. గ్రహణం సమయంలో గుడి మూసివేస్తారు. కాబట్టి ఇంట్లోనే దేవుడి ముందు కూర్చుని ధ్యానం చేసుకోవచ్చని పండితులు తెలిపారు. లేదా జపం కూడా చేసుకోవచ్చన్నారు. మంత్రం కూడా చదువుకోవచ్చన్నారు. దీని వల్ల మానసిక బలం ఏర్పడుతుందన్నారు.
Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత.. టైమింగ్స్ ఇవే..