Bheeshma Ekadasi Representative Image (Image Credit To Original Source)
Bheeshma Ekadasi: భీష్మ ఏకాదశికున్న ప్రాధాన్యత ఏంటి? ఎలాంటి విధివిధానాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి? విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ది సాధించవచ్చో తెలుసుకుందాం. మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. 2026 జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి వచ్చింది.
మాఘ మాసంలో శుక్ల పక్షంలో అష్టమి రోజున భీష్ముడు శరీరాన్ని విడిచి పెట్టాడు. దాన్ని భీష్మాష్టమి అనే పేరుతో పిలిచారు. కానీ, అష్టమి రోజున శరీరం విడిచి పెట్టిన భీష్ముడి కోసం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ఏకాదశిని ప్రత్యేకంగా కేటాయించాడు. అదే భీష్మ ఏకాదశి. కృష్ణుడే స్వయంగా భీష్ముడి కోసం కేటాయించిన ప్రత్యేకమైన ఏకాదశి కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. భీష్మ ఏకాదశి రోజున ఎవరైనా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా, విన్నా కోట్ల జన్మల్లో పాపాలు తొలగిపోతాయి. అనేక జన్మల శాపాల నుంచి బయటపడొచ్చు. కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.
విష్ణుసహస్ర నామ స్తోత్రం మొత్తం చదవలేని వాళ్లు, వినడం వీలు కాని వాళ్లు, సమయం లేని వాళ్లు రెండు మంత్రాలు ఆ రోజు మనసులో అనుకుంటూ ఉండండి. అవేమిటంటే.. అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఈ రెండు మంత్రాలు ఆరోజంతా వీలైనప్పుడల్లా మనసులో అనుకోండి. ఈ రెండు మంత్రాలు చదువుకున్నా ఏడాది మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే కృష్ణుడిని పూజించడం వల్ల కోరికలు నెరవేరతాయి. అందుకే భీష్మ ఏకాదశి రోజున అందరూ కూడా పూజా మందరింలో కృష్ణుడి చిత్రపటాన్ని ఉంచి, ప్రమిద ఉంచి, అందులో ఆవు నెయ్యి పోసి 6 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. బుధ గ్రహ దోషాలు, శుక్ర గ్రహ దోషాలు పోగొట్టే శక్తి కృష్ణుడికి ఉంటుంది కాబత్తి 5 ఒత్తుల దీపం వెలిగించుకోవచ్చు, 6 ఒత్తుల దీపమైనా వెలిగించుకోవచ్చు. శ్రీకృష్ణుడికి నీలం రంగు పూలు అంటే చాలా ఇష్టం. తులసి దళాలు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి శ్రీకృష్ణుడి చిత్రపటానికి తులసి దళాలతో, నీలం పూలతో పూజ చేస్తూ కృష్ణుడి 108 నామాలు భీష్మ ఏకాదశి రోజున చదవాలి.
108 నామాలు చదువుకోలేని ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పుకోవాలి. ఇది చాలా శక్తివంతమైనది, సులభమైన మంత్రం. ఈ మంత్రం చదువుకుంటూ నీలం రంగు పువ్వులతో, తులసి దళాలతో కృష్ణుడిని పూజించాలి. 21సార్లు ఈ మంత్రం చదువుకున్న కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం ఏదైనా నైవేద్యం పెట్టిండి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వారు పాలలో అటుకులు కలిపి ఆ పాలు కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. కృష్ణుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్న వాళ్లు కృష్ణుడి పూజలో కొన్ని నెమలి పించాలు ఉంచండి. పూజ పూర్తయ్యాక ఆ నెమలి పించాలు ధనం దాచుకునే బీరువాలో దాచి పెట్టండి. ఇలా ఇంట్లో కృష్ణుడిని పూజిస్తే చాలా మంది. దేవాలయానికి వెళ్లి కృష్ణుడిని దర్శించుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కృష్ణుడి ఆలయంలో ధ్వజ స్తంభం దగ్గర దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సరి సంఖ్యలో ఆలయంలో ప్రదక్షణలు చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
ఉపవాసం ఎలా ఉండాలంటే..
భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మంచిది. అన్నం తినకూడదు. పాలు, పండ్లు తీసుకోవాలి. రాత్రికి పాలు, పండ్లే తీసుకోవాలి. మరునాడు స్నానం చేసి కృష్ణుడిని పూజించుకుని ఆహారం స్వీకరిస్తే మంచిది. అలా ఉండలేని వాళ్లు ఉదయం పాలు పండ్లు తీసుకుంటూ రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్ధం (ఉప్మా) తినండి. దీన్ని హరి నక్తం అంటారు. ఇలా ఉన్నా కూడా ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.