Ekadanta: వినాయకుడి దంతం ఎలా విరిగింది? గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు?

యుద్ధంలో తాను గెలిస్తే శివుడిని కలవడానికి లోపలికి వెళ్లేందుకు అనుమతివ్వాలని చెబుతాడు. అందుకు సరే అన్న గణనాధుడు...(Ekadanta)

Ekadanta: వినాయకుడిని విఘ్నాదిపతి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. త్రిమూర్తుల నుంచి దేవుళ్లంతా ఆ బొజ్జ గణపయ్యను పూజించిన వాళ్లే. ఇక హిందువులు ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తారు.

పార్వతీ పుత్రుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు విజయవంతం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. మనం చేసే పనుల్లో అడ్డంకులు, ఆటంకాలు రాకుండా అన్ని విఘ్నాలను తొలిగించే దేవుడు కాబట్టే.. గణపయ్యకు విఘ్నాదిపతి అన్న పేరు ఉంది.

వినాయకుడి దంతం ఎలా విరిగింది, గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు అనేదానికి అనేక ఆసక్తికరమైన పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గణపతి పురాణం ప్రకారం.. వినాయకుడు, పరశురాముడి మధ్య యుద్ధం జరిగింది. పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చినప్పుడు లోపలికి వెళ్లటానికి వినాయకుడు అనుమతి ఇవ్వలేదు. దీంతో కోపం వచ్చిన పరశురాముడు లోపలికి వెళ్లనివ్వకపోతే తనతో యుద్ధం చేయాలంటాడు.

ఇద్దరి మధ్య భీకర యుద్ధం..

యుద్ధంలో తాను గెలిస్తే శివుడిని కలవడానికి లోపలికి వెళ్లేందుకు అనుమతివ్వాలని చెబుతాడు. అందుకు సరే అన్న గణనాధుడు యుద్ధం చేయడానికి ఒప్పుడుకున్నాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో పరశురాముడు గొడ్డలితో వినాయకుడిపై దాడి చేశాడు. ఈ గొడ్డలి గణేశుడి దంతాలలో ఒకదానికి తగులుతుంది. దాంతో ఒక దంతం విరిగిపడిందట. అలా, గణపతి దంతం విరిగిందని, గణేశుడు ఏకదంతుడు అయ్యాడని చెబుతారు.

దంతం విరగడానికి కారణం పరశురాముడు కాదా?

మరో పురాణ కథ ప్రకారం లంబోదరుడి దంతం విరగడానికి కారణం పరశురాముడు కాదు అతని సోదరుడు కార్తికేయుడట. ఇద్దరు సోదరులది పూర్తి భిన్నమైన స్వభావం. కార్తికేయుడిని గణపయ్య చాలా ఇబ్బంది పెట్టాడట. ఒక పోరాటంలో కార్తికేయుడు బొజ్జ గణపయ్యకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడట. గణపతిని కొట్టడంతో దంతాలలో ఒకటి విరిగిపోయిందని చెబుతారు.

ఒక దంతాన్ని విరిచి పెన్నులా మార్చి..!

మరో ఇతిహాసం ప్రకారం.. వేదవ్యాసుడు మహా భారతాన్ని రాయమని గణపతిని కోరినప్పుడు ఒక షరతు పెట్టాడట. తాను మహా భారతాన్ని చెప్పే క్రమంలో ఆపకుండా చెబుతూనే ఉంటాననీ, కాబట్టి వింటూ ఆపకుండా రాయమని అంటాడట. ఆ సమయంలో వినాయకుడు స్వయంగా తన దంతాలలో ఒకదాన్ని విరిచి పెన్నులా తయారు చేశాడని అందుకే ఏకదంతుడు అయ్యాడని అంటారు.

దంతం పడిన చోటు ఇదే..

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. వినాయకుడి దంతం పడిన ప్రాంతం ఉందని, అక్కడ ఒక ఆలయం కూడా ఉందని చెబుతారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో బర్సూర్ లోని ధోల్కల్ కొండలపై 100 సంవత్సరాల పురాతనమైప గణేశ్ విగ్రహం 3వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటి.

ఇతడిని దంతెవాడ రక్షకుడిగా పిలుస్తారు. పరుశురాముడు, గణేశుడికి జరిగిన యుద్ధంలో దంతం విరిగిన ప్రాంతం ఇదేనట. అందుకే దీన్ని దంతెవాడ అని పిలుస్తారు. దంతెవాడ జిల్లాలో కైలాస గుహ కూడా ఉందట. ఇక్కడే గణపతికి, పరశురాముడికి మధ్య యుద్ధం జరిగిందంటారు.

Also Read: కుడివైపా? ఎడమవైపా? ఇంట్లో పెట్టే వినాయకుడి తొండం ఎటువైపు ఉంటే మంచిది.. పండితులు ఏం చెబుతున్నారు..