US Fed Chairman Jerome Powell
US Fed Chairman Jerome Powell : ఆయన మాట్లాడింది కేవలం ఎనిమిదంటే 8 నిమిషాలు మాత్రమే. కాని అమెరికా ధనవంతులకు మాత్రం ఆ మాటలు రక్త కన్నీరునే తెప్పించాయి. వారి ఆస్తుల విలువ ఏకంగా 78 బిలియన్ డాలర్లు పడిపోయింది. అంటే మన కరెన్సీలో అమెరికా ధనవంతుల ఆస్తి దాదాపు 6 లక్షల 25 వేల కోట్ల రూపాయలు కరిగిపోయింది. యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం అంత పవర్‌ఫుల్ మరి. ఇంతకూ ఆయన ఏమన్నారంటే… ద్రవ్యోల్బణ కట్టడి కోసం కీలక వడ్డీరేట్లను భారీగా పెంచే అవకాశాలున్నాయని చెప్పారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీ రేట్లు పెంచక తప్పని పరిస్థితి తలెత్తిందని… దీన్ని భరించడం తప్ప మరో మార్గం లేదన్నారు. పావెల్ 8 నిమిషాల స్పీచ్‌కు ప్రపంచ మార్కెట్లన్నీ గడగడలాడాయి. క్రితం సెషన్‌లో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి కోసం అమెరికా సెంట్రల్ బ్యాంకు తీసుకునే చర్యలు అమెరికాలోని సంపన్న కుటుంబాలను, వ్యాపారాలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయిలో ఉంది.
Briran Inflation : ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న బ్రిటన్..భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రతిరోజూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తుంది. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరుగాంచిన టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సంపద 5 పాయింట్ 5 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. మస్క్ సంపద 254 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంపన్నుడైన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద 6 పాయింట్ 8 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.
మొత్తంగా ఈ ఇద్దరు టాప్ బిలీనియర్స్ సంపదనే మన కరెన్సీలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆవిరైంది. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ సంపద 2.2 బిలియన్ డాలర్లు, 2.7 బిలియన్ డాలర్ల చొప్పున తగ్గిపోయింది. సెర్జి బ్రిన్ సంపద కూడా 100 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఓవరాల్‌గా చూస్తే అమెరికా ధనవంతుల ఆస్తుల విలువ మన కరెన్సీలో 6 లక్షల 25వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది.