Nitin Gadkari : త్వరలో రోడ్లపైకి 132 సీట్లతో పెద్ద బస్సు.. విమానంలో మాదిరిగా బస్ హోస్టెస్‌లు, ఫుడ్ కూడా.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?

Nitin Gadkari : ఇందులో విమానం లాంటి సీటింగ్‌తో పాటు హెయిర్ హోస్టెస్ మాదిరిగా "బస్ హోస్టెస్" కూడా ఉంటారు. సాధారణ డీజిల్ బస్సుల కన్నా అత్యంత చౌకగా ఉన్నప్పటికీ కాలుష్య రహిత ఇంధన వనరులపైనే ఈ బస్సు నడుస్తుంది.

Nitin Gadkari : త్వరలో రోడ్లపైకి 132 సీట్లతో పెద్ద బస్సు.. విమానంలో మాదిరిగా బస్ హోస్టెస్‌లు, ఫుడ్ కూడా.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?

132-Seater Bus, Food And Hostesses_ Nitin Gadkari's Pilot Project ( Image Source : Google )

Nitin Gadkari : భారత్‌లో కాలుష్యం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. వ్యక్తిగత, ప్రజా రవాణాకు తీవ్రంగా ఆటంకం కలిగిస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుకూలమైన కాలుష్య రహిత వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టిపెడుతోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎన్‌డీటీవి ఇన్‌ఫ్రాశక్తి అవార్డుల సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాగ్‌పూర్‌లో 132-సీట్ల బస్సుతో కూడిన పైలట్ ప్రాజెక్ట్‌ రూపకల్పన జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.

ఇందులో విమానం లాంటి సీటింగ్‌తో పాటు హెయిర్ హోస్టెస్ మాదిరిగా “బస్ హోస్టెస్” కూడా ఉంటారు. సాధారణ డీజిల్ బస్సుల కన్నా అత్యంత చౌకగా ఉన్నప్పటికీ కాలుష్య రహిత ఇంధన వనరులపైనే ఈ బస్సు నడుస్తుంది. భారత దిగుమతిదారుగా కాకుండా నికర ఇంధన ఎగుమతిదారుగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ స్పష్టం చేశారు.

Read Also : iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

“ఈ రోజు దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య కాలుష్యం. గాలి, నీరు, ధ్వని కారణంగా కాల్యుష వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు దిగుమతి-ప్రత్యామ్నాయ, తక్కువ ఖర్చుతో కూడిన కాలుష్య రహిత, స్వదేశీ రవాణా పరిష్కారాలు అవసరం. మనకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు, భారతీయ ఆయిల్ 300 ఇథనాల్ పంపులను ఏర్పాటు చేస్తోంది. ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను తీసుకువస్తున్నాయి. లీటరుకు రూ. 120కి పెట్రోల్ నింపే బదులు వాహనంలో 60శాతం విద్యుత్, 40శాతం చొప్పున ఇథనాల్‌ను ఉపయోగించడం మంచిది. ఇథనాల్‌ వాడకంతో కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది” అని మంత్రి పేర్కొన్నారు.

మరో విషయం ఏమిటంటే.. ప్రజా రవాణా ఖర్చును తగ్గించడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని గడ్కరీ అన్నారు. డీజిల్ బస్సు ఒక కిలోమీటర్ నడపడానికి రూ. 115 ఖర్చవుతుంది. అయితే, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రూ. 41, నాన్-ఏసీ బస్సులు రూ. 37 సబ్సిడీలతో నడుస్తాయి. సబ్సిడీలు లేకుండా ఇప్పుడు రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంటుంది. టిక్కెట్ ధరలను 15 నుంచి 20శాతం తగ్గించడంలో సాయపడుతుందని ఆయన అన్నారు.

టాటాతో కలిసి నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. చెక్ రిపబ్లిక్‌ వెళ్లిన సమయంలో వారి వద్ద మూడు బస్సుతో ఒక ట్రాలీ బస్సు ఉందన్నారు. మా పైలట్ ప్రాజెక్ట్ 132 మంది కూర్చునే విధంగా రింగ్ రోడ్‌లో 49 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కేంద్రం మంత్రి గడ్కరీ చెప్పారు. 40 కిలోమీటర్ల తర్వాత బస్‌స్టాప్‌లో ఆగుతుంది. కేవలం 40 సెకన్లలో తదుపరి 40 కిలోమీటర్లకు ఛార్జ్ అవుతుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ. 35 నుంచి రూ. 40 ఖర్చు అవుతుంది.

గడ్కరీ ఇంకా ఏమన్నారంటే? :
‘‘సీట్ల ముందు ల్యాప్‌టాప్ ఉంచడానికి ఎయిర్ కండిషనింగ్, సౌకర్యవంతమైన కుర్చీలు, స్థలం అవసరమని సూచించాను. ఎయిర్ హోస్టెస్‌ల మాదిరిగా ప్రజలకు పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, పానీయాలు ఇవ్వడానికి బస్ హోస్టెస్‌లు ఉండాలి. నా లెక్క ఇది. సోలార్‌ పవర్‌ను ఉపయోగిస్తే బస్సు ధర 30శాతం తక్కువగా ఉంటుంది” అన్నారాయన. 50శాతం ఇథనాల్, 50శాతం సీఎన్‌జీని ఉపయోగించే నిర్మాణ సామగ్రిని జేసీబీ తయారు చేసింది. ఇథనాల్, మిథనాల్, సీఎన్‌జీతో పనిచేసే యంత్రాలపై ట్రాక్టర్ తయారీదారులు కూడా పనిచేస్తున్నారు. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు దోహదపడుతుంది’’ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

స్టబుల్ నుంచి ఇథనాల్ :
ఇండియన్ ఆయిల్ స్టబుల్ నుంచి ఒక లక్ష లీటర్ల ఇథనాల్‌ను, అలాగే బయో బిటుమెన్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందని గడ్కరీ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తయిందని, 76వేల టన్నుల బయో ఏవియేషన్ ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. మరో ప్రాంతంలో ఢిల్లీలోని ఘాజీపూర్ పల్లపు ప్రదేశంలో అలాగే అహ్మదాబాద్‌లోని వ్యర్థాల పర్వత ఎత్తును ఏడు మీటర్ల మేర తగ్గించినట్లు గడ్కరీ చెప్పారు. మురుగునీటి కలుషిత నీటిని శుద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారని తెలిపారు.

సేంద్రీయ వ్యర్థాలను బయో సీఎన్‌జీ, బయో ఎల్‌ఎన్‌జి లేదా హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. డ్రోన్‌లు, రోప్‌వేలు కూడా ఏర్పాటు చేయాలనేది తమ దృష్టిలో ఉన్నాయని, మంత్రిత్వ శాఖకు ఆసక్తి కలిగించే మరో ప్రాంతం ఫ్యూనిక్యులర్ రైల్వేలు (నిటారుగా ఉండే కొండలపై ఉపయోగించే తాడుతో నడిచే రైళ్లు), ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ వంటి ప్రాంతాల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇవన్నీ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సాయపడతాయని భావిస్తున్నామని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు.

3 నెలల్లో జీపీఎస్ టోలింగ్ :
ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తున్న జీపీఎస్‌ ఆధారిత టోలింగ్‌ను మూడు నెలల్లో 5వేల కిలోమీటర్ల రోడ్డుపై అమలు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. “టెండర్లు సిద్ధంగా ఉన్నాయి. శాటిలైట్ ఆధారిత టోలింగ్ నిర్దిష్ట రహదారిపై ప్రయాణించిన కిలోమీటర్ల సంఖ్యకు మాత్రమే చెల్లించేలా చేస్తుంది. ఆ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిబిట్ అవుతుంది.

మీరు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. ఇది 5వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దేశంలో అన్ని చోట్లా అమలు చేస్తాం” అని ఆయన చెప్పారు. వ్యవసాయంలో “హరిత విప్లవం”మే తాను లక్ష్యంగా పెట్టుకున్నానని గడ్కరీ పేర్కొన్నారు. తన ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని తద్వారా పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని తెలిపారు.

Read Also : Best Tech Deals 2024 : కొత్త ఫోన్ ఏది కొంటే బెటర్.. ఐఫోన్ 14 ప్లస్, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్లపై అదిరే ఆఫర్లు..!