టెక్ ఊయల : ‘అమ్మ ఒడి’లాంటి ‘మామారూ’

అమ్మ ఒడి..పాపాయికి భరోసా. అమ్మ ఒడిలో పడుకుని పాపాయి హాయిగా నిద్రపోతుంది. అలా నిద్రపోయే బిడ్డను తీసి మంచంపై పడుకోబెడితే ఠక్కుమని నిద్రలేచి ఏడుపు అందుకుంటుంది. మళ్లీ అమ్మ ఒడిలో పడుకోబెట్టుకుంటే ఏడుపు ఠక్కుమని ఆపేసి చక్కగా నిద్రపోతుంది. అది అమ్మ ఒడి అంటే. బిడ్డలు ఉయ్యాలో కంటే హాయిగా నిద్రపోతారు అమ్మఒడిలో.
అటువంటి అమ్మ ఒడిలాంటి ఉయ్యాల (ఊయల) మార్కెట్ లోకి త్వరలోనే వచ్చేస్తోంది. ఆ ఊయల పేరు ‘మామారూ’. ఈ ‘మామారూ’ లో పసిబిడ్డలు అమ్మ ఒడిలో కంటే హాయిగా నిద్రపోతారట. అమ్మ పక్కన లేకుండా పసివాళ్లను నిద్రపుచ్చడం ఎంత కష్టమో తెలిసిందే.ఒక్కోసారి పిల్లల్ని నిద్రపుచ్చడం తల్లికి కూడా సాధ్యంకాదు. అదే మరి ఆ తల్లి డ్రైవింగ్‌లో ఉంటే? చచ్చినట్లు కారు పక్కనే ఆపేసి పిల్లాడిని బుజ్జగించాలి. అలాంటి వారి కోసమే ఈ కొత్త బేసినెట్(చిన్నసైజు ఉయ్యాల వంటిది) అంటోంది 4మామ్స్ కంపెనీ. వారు ‘మామారూ’ పేరిట ఓ కొత్త ఉయ్యాలను మార్కెట్లోకి తెస్తున్నారు. దీన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన సీఈఎస్(కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో)-2020లో ప్రదర్శించారు.
మంగళవారం (జనవరి 7) ప్రారంభమైన సీఈఎస్-2020 కార్యక్రమంలో ‘మామరు’ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పిల్లలను బుజ్జగించడానికి తల్లి ఎలాగైతే బేసినెట్‌ను చేతుల్లోకి తీసుకొని ఊపుతుందో దాన్నే మామారూ కూడా ఉంటుందని ఈ కంపెనీ తెలిపింది. మామరుతో పిల్లలకు అమ్మానాన్నలు తమతోనే ఉన్నారన్న భరోసా ఉంటుందంటోంది ఈ సంస్థ.
ఈ మామారూలో రకరకాల సెట్టింగులున్నాయని, వీటన్నింటినీ ‘4మామ్స్’ యాప్‌తో తల్లిదండ్రులు ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చని తెలిపారు.