7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా 1.2 కోట్లకు పైగా ఉద్యోగులకు దీపావళికి ముందే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. 7వ వేతన సంఘం ప్రకారం.. పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉంది.
నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం దీపావళికి (7th Pay Commission) ముందు.. అంటే అక్టోబర్ మొదటి వారంలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతం, పెన్షన్ భారీగా పెరగనున్నాయి.
దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్ :
కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ డీఏ పెంపు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే.. ఉద్యోగులకు 3 నెలల బకాయిలు కూడా లభిస్తాయి. ఈ బకాయిలు అక్టోబర్ జీతంతో పాటు అందుతాయని భావిస్తున్నారు. డిసెంబర్ 31, 2025 నుంచి అమల్లోకి వచ్చే 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న సమయంలో ఈ పెంపు మరింత ఆనందాన్ని కలిగించనుంది.
డీఏ ఎలా లెక్కిస్తారంటే? :
వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ లెక్కిస్తారు. ఈ సూచిక గత 12 నెలల సగటు ఆధారంగా నిర్ణయిస్తారు. జూలై 2024 నుంచి జూన్ 2025 వరకు CPI-IW సగటు 143.6 కాగా ఉంటే.. డియర్‌నెస్ అలవెన్స్ రేటును 58 శాతానికి వస్తుంది. జూలై-డిసెంబర్ 2025 కాలానికి కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెరుగుతుంది.
జీతం, పెన్షన్ ఎంత పెరుగుతుంది? :
డీఏ పెంపుదల వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా భారీగా డబ్బు వచ్చి చేరుతుంది. అది ఎలాగంటే.. ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం రూ. 50వేలు అయితే, పాత 55శాతం రేటు ప్రకారం.. రూ. 27,500 DA పొందవచ్చు. ఇప్పుడు 58శాతం కొత్త రేటుతో రూ. 29,000కి పెరుగుతుంది.
ప్రతి నెలా రూ. 1,500 అదనపు బెనిఫిట్స్ ఇస్తుంది. అదేవిధంగా, రూ. 30వేలు ప్రాథమిక పెన్షన్ ఉన్న పెన్షనర్ DR 55శాతం నుంచి 58శాతానికి పెరుగుతుంది. నెలవారీ పెన్షన్ రూ. 900 పెరుగుతుంది. ఈ పెంపుతో ఉద్యోగులకు ప్రతి నెలా రూ. 1,500 అదనపు ప్రయోజనం లభిస్తుంది. పెన్షనర్లకు రూ. 900 లభిస్తుందని తెలుస్తోంది.
ఇదే చివరి పెంపునా? :
7వ వేతన సంఘం పెంపు కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. 7వ వేతన సంఘం కింద చివరి డీఏ పెంపు ఇదే. ఈ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2025 జనవరిలో 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది. కానీ, సభ్యులు, నిబంధనలను (ToR) ఇంకా ఖరారు చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో కొత్త కమిషన్ రాకముందే ఈ పెంపు ఉద్యోగులకు భారీగా రిలీఫ్ అందించనుంది.