8th Pay Commission Update
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 8వ వేతన సంఘం ప్రకారం.. ఈసారి డీఏ బకాయిలను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గత కొన్ని నెలల్లో డీఏ బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత జనవరిలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలోనే 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ (DA) బకాయిలు విడుదల చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. 2020లో కరోనా సమయంలో డీఏ, డీఆర్ బకాయిలను నిలిచిపోగా, ఇప్పటికీ విడుదల చేయలేదు. ఇదే విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది.
డీఏ పెంపుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానిమిచ్చారు. కరోనా అప్పుడు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కారణంగా 3 విడతల డీఏ, డీఆర్ నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. డీఏ బకాయిల నిలుపుదలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు. సంక్షేమ నిధుల విషయంలో భారం పెరిగిందన్నారు.
7వ వేతన సంఘం ప్రకారం.. ప్రస్తుతం డీఏ, డీఆర్ 53 శాతంగా ఉండగా, 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కొత్త వేతన కమిటీ సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే డీఏను 2 సార్లు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం, పెన్షన్ భారీగా పెరగనుంది. చాలా మంది కొత్త జీతంతో నెలవారీ ఆదాయం ఎంత పెరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. నివేదికల ప్రకారం.. జీతాల పెంపు కోసం 7వ వేతన సంఘం మాదిరిగానే లెవల్ 1 నుంచి లెవల్ 10 వరకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారమే కనీస వేతనాన్ని పెంచుతారు. 7వ వేతన సంఘంలో ఇది 2.57గా ఉంది. దీని కారణంగా లెవల్ 1 కనీస జీతం రూ.7వేలు (6వ వేతన సంఘం) నుంచి రూ.18వేలకి పెరిగింది. అయితే, ఇది టేక్ హోం జీతం కాదు. డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), రవాణా అలవెన్స్, ఇతర ప్రయోజనాలను కలిపితే మొత్తం జీతం రూ. 36,020 అయింది.
ఫిట్‌మెంట్ 2.86కి పెంపు? :
ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకాన్ని 2.86కి పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, లెవల్ 1లో మూల వేతనం రూ.18వేల నుంచి రూ.51,480కి పెరుగుతుంది. దీని ప్రభావం అన్ని ఇతర లెవల్స్ ఉద్యోగాల్లో కూడా కనిపిస్తుంది. ఉద్యోగుల జీతం, పెన్షన్ గణనీయమైన పెరుగుతుంది.
Read Also : 8th Pay Commission : బిగ్ అప్‌డేట్.. జీతాల జాబితాలో కీలక మార్పులు.. ఉద్యోగులు, పెన్షర్లకు ఎంత పెరగనుందంటే?
కొత్త జీతం అమలు ఎప్పుడంటే? :
8వ వేతన సంఘం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత సిఫార్సులను అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. అన్నీ సకాలంలో జరిగితే, వచ్చే ఏడాది నాటికి కేంద్ర ఉద్యోగులు కొత్త జీతాన్ని అందుకుంటారు. మొత్తం మీద, అన్ని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం నుంచి బిగ్ రిలీఫ్ పొందుతారని భావిస్తున్నారు.