Airtel యూజర్లకు షాక్: ఫోన్‌ కాల్, డేటా ప్లాన్ ధరలు పెంపు!

  • Published By: sreehari ,Published On : November 19, 2019 / 10:14 AM IST
Airtel యూజర్లకు షాక్: ఫోన్‌ కాల్, డేటా ప్లాన్ ధరలు పెంపు!

Updated On : November 19, 2019 / 10:14 AM IST

మీరు ఎయిర్ టెల్ యూజర్లా? మీకో షాకింగ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో ఎయిర్ టెల్ మొబైల్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ తమ మొబైల్ సర్వీసు టారిఫ్స్ పెంచబోతున్నట్టు ప్రకటించింది. 2019 డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త మొబైల్ కాల్స్, డేటా ధరలు అమల్లోకి రానున్నాయి.

టెలికం రంగంలో సంక్షోభంతో నష్టాల బాటపట్టిన టెలికం కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన ఉత్సాహంతో నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్-ఐడియా తమ మొబైల్ సర్వీసు టారిఫ్స్ పెంచనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే బాటలో భారతీ ఎయిర్ టెల్ కూడా తమ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ సర్వీసు ప్లాన్ ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. 

‘వచ్చే నెల డిసెంబర్ నుంచి ఎయిర్ టెల్ టారిఫ్ ధరలను పెంచనుంది’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవైపు కస్టమర్లకు తగిన టారిఫ్ ధరలను అందించడమే కాకుండా మరోవైపు తమ వ్యాపారాన్ని నిలదొక్కుకోగల స్థితికి చేరుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. తమ కస్టమర్లకు నైణ్యమైన ప్రమాణాలతో సర్వీసులను అందించాలంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ అవసరమని భావిస్తోంది. టెక్నాలజీ యుగం వేగంగా మారుతోందని, అందుకు తగినట్టుగా టెలికం రంగం కూడా అధిక మూలధనంతో కూడుకున్నదిగా పేర్కొంది. అందుకు పెట్టుబడులు నిరంతరాయంగా ఉంటేనే సాధ్యమని భావిస్తోంది. 

గత త్రైమాసికానికి సంబంధించి కొన్నిరోజుల క్రితం భారీ నష్టాన్ని నమోదు చేసిన వోడాఫోన్-ఐడియా, భారతీయ ఎయిర్ టెల్ కంపెనీలు మొబైల్ సర్వీసు టారిఫ్ ధరలను పెంచాలని నిర్ణయించాయి. AGR పెండింగ్ పేమెంట్స్ పై సుప్రీంకోర్టు కేటాయించిన తర్వాత ఈ రెండు కలిసి చెల్లించాల్సిన మొత్తం రూ.80వేల కోట్లు వరకు ఉంది. ఈ పేమెంట్స్ విషయంలో నియమ నిబంధనలను మార్చాలని రెండు టెలికోలు ప్రభుత్వాన్ని కోరాయి. 

దీనిపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం.. వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ మొబైల్ సర్వీసు టారిఫ్స్ ఎంత మేరకు పెంచనున్నాయో అనేది క్లారిటీ లేదు. ఎయిర్ టెల్ తమ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ధరలను కూడా పెంచుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.