Amazon Employee : పీకేసిన కంపెనీలోనే సీనియర్‌గా చేరిన అమెజాన్ ఉద్యోగి.. మెటర్నిటీ లీవ్‌లో ఉండగా తొలగింపు.. అసలేం జరిగిందంటే?
Amazon Employee : 2023 జనవరిలో అమెజాన్ తొలగించిన ఒక మహిళా ఉద్యోగి, ఇప్పుడు అదే కంపెనీలో సీనియర్ రోల్ ఉద్యోగంలో చేరింది. కేవలం నాలుగు నెలల తర్వాత తన పాత టీంతో కలిసి విధులు నిర్వర్తిస్తోంది.

Amazon employee rejoins company in senior role after fired in January
Amazon Employee Fired in January : కొన్ని నెలల క్రితం ఎక్కడ ఉద్యోగం పొగట్టుకుందో అక్కడే తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకుంది ఓ మహిళా ఉద్యోగి. గత జనవరిలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Layoffs) దాదాపు 18వేల మందిని కంపెనీ నుంచి తొలగించింది. ఆ సమయంలో అనేక మంది అమెజాన్ ఉద్యోగులు రోడ్డునపడ్డారు. వారిలో పైజ్ సిప్రియాని (Paige Cipriani) అనే మహిళా ఉద్యోగి కూడా ఉంది. అయితే, అమెజాన్ తొలగింపుల నేపథ్యంలో ఆ మహిళ ఉద్యోగి మెటర్నిటీ లీవ్‌లో ఉంది.
సెలవుల అనంతరం తిరిగి ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన పైజ్ సిప్రియానికి చేదు అనుభవం ఎదురైంది. తనను ఉద్యోగంలో నుంచి తొలగించినట్టు తెలిసి ఒక్కసారిగా ఆమె షాకింగ్‌కు గురైంది. కానీ, సిప్రియాని అదృష్టవశాత్తూ కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అమెజాన్‌లో తన ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకుంది. తన పాత టీమ్‌తో కలిసి హాయిగా ఇప్పుడు పనిచేసుకుంటోంది. 2023 జనవరిలో అమెజాన్ ఉద్యోగాల కోతతో సిప్రియాని తీవ్ర నిరాశకు లోనైంది. సరిగ్గా 4 నెలల తర్వాత అదే కంపెనీకి ప్రొడక్టు మార్కెటింగ్ మేనేజర్‌గా తిరిగి వచ్చింది.
లింక్డిన్ వేదికగా అసమ్మతి తెలిపిన ఉద్యోగి :
ఉద్యోగంలో నుంచి తొలగించారనే విషయం తెలియగానే సిప్రియని లింక్డిన్ (Linkedin) వేదికగా తన అసమ్మతిని తెలియజేసింది. గతంలో అమెజాన్‌లో ఇంటర్నల్ రిక్రూటర్ గా పనిచేసిన సిప్రియాని.. తన మనసులోని భావాలను నిజాయితీగా ఇలా వ్యక్తం చేసింది.. ‘హలో, లింక్డిన్ మిత్రులారా.. నేను మీ అందరికీ ఒక విచారకరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, ఇటీవల మెటర్నిటీ సెలవుల నుంచి తిరిగి వచ్చిన వెంటనే అమెజాన్ ఇంటర్నల్ రిక్రూటర్ రోల్ నుంచి తొలగించింది. అయినప్పటికీ పాజిటివ్‌గానే తీసుకుంటున్నాను.
అమెజాన్ తొలగింపుల వల్ల ప్రభావితమైన 18వేల మంది ఉద్యోగులలో నేను కూడా ఉన్నాను. ఇది నిజంగా చాలా కఠినమైనది.. కంపెనీలో నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది.. ఇంతలోనే తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఏదిఏమైనా ఒక కంపెనీలో కొంతమంది తెలివైన వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందనందుకు చాలా సంతోషంగా ఉంది. చేసిన కొద్ది రోజులైన కంపెనీ ఎదుగుదలకు అవసరమైన అన్నింటిని సమర్థవంతంగా పూర్తి చేయగలిగాను. తోటివారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక నుంచి కొత్త కెరీర్ అవకాశాల కోసం నా వంతు ప్రయత్నాలు చేస్తాను’ అని సిప్రియాని ఆవేదన వెలిబుచ్చింది.

Amazon employee rejoins company in senior role after fired in January
అదే కంపెనీలో సీనియర్ రోల్ ఉద్యోగం :
కొద్ది నెలలు గడిచాక అమెజాన్ కంపెనీ తనను తిరిగి ఉద్యోగంలో చేరమనడంతో సిప్రియాని ఎగిరి గంతేసింది. అదే సోషల్ మీడియా వేదికగా సిప్రియాని తన సంతోషాన్ని పంచుకుంది. అమెజాన్‌లో తాను తిరిగి ఉద్యోగంలో చేరిన విషయాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. జనవరిలో తొలగించిన అదే టీంలోనే తాను మళ్లీ చేరానని, కొత్తగా హై పొజిషన్లో ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ రోల్ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసింది. గతంలో కన్నా భిన్నమైన వ్యాపారంపై దృష్టి సారిస్తానని సిప్రియాని చెప్పుకొచ్చింది.
గత వారంలో అమెజాన్ ఇండియా వివిధ విభాగాలలో దాదాపు 500 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. గత మార్చిలో సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించిన వర్క్‌ఫోర్స్‌లో తగ్గింపులో ఇదో భాగమని చెప్పవచ్చు. కంపెనీలో సుమారు 9వేల మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరిస్తున్న మెటా (Meta), గూగుల్ (Google)తో సహా ఇతర ప్రముఖ టెక్ కంపెనీల ర్యాంక్‌లో అమెజాన్ చేరింది.
Read Also : Honda Shine 100 : సరసమైన ధరకే హోండా షైన్ 100 బైక్.. ఒకే రోజులో 500 యూనిట్లు డెలివరీ..!