ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా.. మనదేశ మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించేందుకు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2025లో ఏకంగా రూ.2,000 కోట్లు ($233 మిలియన్) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ భారీ పెట్టుబడితో డెలివరీలు వేగంగా జరగడంతో పాటు, మెరుగైన సేవలు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా అమెజాన్ పెద్దపీట వేస్తోంది.
అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. డెలివరీ, గోడౌన్ పనులు, కస్టమర్ సపోర్ట్ మొదలైనవి ఉంటాయి. కొత్తగా పని వెతుకుతున్నవారికి ఇది మంచి అవకాశం. డెలివరీ బాయ్స్‌కు విశ్రాంతి కేంద్రాలు, ఆరోగ్య పరీక్షలు, బీమా సదుపాయం కూడా ఉండనుంది. ప్రమాదాలను తగ్గించేందుకు సేఫ్టీ పద్ధతులు తీసుకువస్తారు. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా సర్వీస్ వేగంగా ఉంటుంది.
స్థానిక వ్యాపారాలకు ఊతం వస్తుంది. ఆమెజాన్‌లో ఉత్పత్తులు అమ్మే చిన్న వ్యాపారాలు వేగంగా డెలివరీ చేసి మరింత మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఆదాయం పెరుగుతుందీ, బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. అమెజాన్ కొత్త పెట్టుబడులతో యాప్ వాడడం కూడా సులభంగా మారుతుంది, అడ్రసులు క్లియర్ గా గుర్తించేందుకు సదుపాయాలు వస్తాయి.
“భారత్‌లో అత్యంత విస్తృతమైన లాజిస్టిక్ వ్యవస్థను మేము నిర్మించాం. ఈ పెట్టుబడి మా దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనం. వేగవంతమైన డెలివరీ, మెరుగైన భద్రత, మానవ వనరుల శ్రేయస్సే మా అంతిమ లక్ష్యం” అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ అన్నారు.
Also Read: ఎట్టకేలకు కన్ఫార్మ్ చేసిన కెనడా.. భారత్‌పై హింసాత్మక చర్యలకు కెనడా నుంచి ఖలీస్థానీల పక్కా ప్లాన్.. ఇప్పుడేమంటావ్ ట్రూడో?
పెట్టుబడి వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
- ఈ పెట్టుబడి కేవలం డబ్బుకు సంబంధించినది కాదు. భారత ఈ-కామర్స్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యం. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు:
- లాజిస్టిక్స్, డెలివరీ: సరుకు రవాణా వ్యవస్థను పటిష్ఠం చేయడం.
- వేగం, విశ్వసనీయత: వినియోగదారులకు మరింత వేగంగా, నమ్మకంగా డెలివరీలు అందించడం.
- ఉద్యోగుల సంక్షేమం: డెలివరీ భాగస్వాములు, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతను మెరుగుపరచడం.
- దేశవ్యాప్తంగా విస్తరణ: కొత్త సెంటర్లు, ఆధునిక టెక్నాలజీ
- ఈ పెట్టుబడితో అమెజాన్ తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది.
- దేశవ్యాప్తంగా కొత్త ఫుల్ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్టేషన్ హబ్‌లు, డెలివరీ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది.
- ఇప్పటికే ఉన్న గిడ్డంగులను ఆటోమేషన్, శీతలీకరణ వ్యవస్థలు (Cold Storage), ఆధునిక భద్రతా ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేయనుంది.
- విశ్రాంతి ప్రాంతాలు, ముఖ్యంగా దివ్యాంగులకు అనుకూలంగా ఉండే ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది.
టెక్నాలజీని మరింత వాడనున్న అమెజాన్
- భద్రతకు పెద్దపీట: టెక్నాలజీతో డ్రైవర్లకు భద్రత కల్పించనుంది.
- డెలివరీ ఉద్యోగుల భద్రత కోసం అమెజాన్ టెక్నాలజీని వాడుతుంది.
- హెల్మెట్ అడియరెన్స్ యాప్ (Helmet Adherence App): డెలివరీ బాయ్, డ్రైవర్ ప్రయాణం మొదలుపెట్టే ముందు హెల్మెట్ ధరించాడో లేదో ఈ యాప్ నిర్ధారిస్తుంది.
- డ్రైవర్ యాప్‌లో మార్పులు: సంపాదన వివరాలు స్పష్టంగా కనిపించడం, సరైన గైడెన్స్ వంటి ఫీచర్లను జోడిస్తున్నారు.
- మానసిక ఒత్తిడి తగ్గింపు: సరుకుల ఫొటో, వీడియో ఆధారిత ధ్రువీకరణ ద్వారా డ్రైవర్లపై ఒత్తిడి తగ్గించనున్నారు.
ఉద్యోగుల సంక్షేమమే మా ప్రాధాన్యం: అమెజాన్
- ఈ పెట్టుబడితో ఉద్యోగుల సంక్షేమం కోసం ఇవి చేస్తారు
- “Ashray” కేంద్రాలు: డెలివరీ వర్కర్ల కోసం విశ్రాంతి కేంద్రాలను విస్తరించనున్నారు.
- Samridhi: ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం.
- Pratidhi: ఉద్యోగుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు.
- Sushruta: ట్రక్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య సేవలు.
- 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 80,000 మంది డెలివరీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేయించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పోటీ తప్పదు: ఫ్లిప్‌కార్ట్‌తో సై అంటే సై!
భారత ఈ-కామర్స్ రంగం 2030 నాటికి $325 బిలియన్ల మార్కెట్‌గా అవతరించనుందని అంచనా. ఇదే సమయంలో, అమెజాన్ ప్రధాన పోటీదారు ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ IPO కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ఆధిపత్యం కోసం అమెజాన్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు ప్రాధాన్యం సంతరించుకుంది.
మొత్తంమీద, అమెజాన్ ఈ భారీ పెట్టుబడి భారత వినియోగదారులకు వేగవంతమైన సేవలను, వేలాది మందికి ఉద్యోగ భద్రతను, చిన్న వ్యాపారాలకు అండగా నిలవనుంది. ఇది భారత ఈ-కామర్స్ రంగంలో రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు.