Gold Rate: గుడ్‌న్యూస్.. మరికొద్ది రోజుల్లో రూ.60వేలకు బంగారం ధర.. కారణాలు ఇవే.. నిపుణులు ఏం చెప్పారంటే..?

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో 10గ్రాముల గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందని ..

Gold Rate: గుడ్‌న్యూస్.. మరికొద్ది రోజుల్లో రూ.60వేలకు బంగారం ధర.. కారణాలు ఇవే.. నిపుణులు ఏం చెప్పారంటే..?

Gold

Updated On : May 18, 2025 / 2:22 PM IST

Gold Rate: బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల వరకు భారత మార్కెట్లో 10గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. తద్వారా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే, కొద్దిరోజులుగా బంగారం ధర తగ్గుతోంది. ప్రస్తుతం రూ. 93,000 కు పడిపోయింది. అయితే, రాబోయే నాలుగైదు నెలల్లో గోల్డ్ రేటు రూ.60వేలకు దిగొచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ప్రస్తుతం గోల్డ్ రేటు తగ్గుతుంది. ఏప్రిల్ లో ఔన్సు బంగారం ధర 3,500 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు ఔన్సు కు 3,140 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం తగ్గడం, సురక్షిత ఆస్తులకు డిమాండ్ తగ్గడం వల్ల బంగారం ధరల్లో ఈ తగ్గుదల చోటుచేసుకుంటుంది. అయితే, బంగారం మరింత తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘిల్ ఇండియా టీవీతో మాట్లాడుతూ.. గత చరిత్ర పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. 2013 సంవత్సరంలో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేశారు. పన్నెండు సంవత్సరాల క్రితం బంగారం ధరలు భారీగా పెరిగి ఒక్కసారిగా పతనం అయ్యాయి. అప్పటి పరిస్థితిలాగే మారితే బంగారం ఔన్సుకు 3,230డాలర్ల నుంచి 1,820 డాలర్లకు పడిపోతుందని సింఘాల్ అన్నారు. ఈ పరిస్థితిలో దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.55 వేల నుంచి రూ.60వేలకు తగ్గుతుందని చెప్పారు.

 

బంగారం ధరలు రాబోయే కాలంలో తగ్గడానికి ఐదు ప్రధాన కారణాలు ..
♦ భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. దీని కారణంగా పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడి ఎంపికల నుంచి దూరమవుతున్నారు. తద్వారా ధరలు తగ్గడానికి కారణమవుతుంది.
♦ అమెరికా డాలర్ బలపడటం మరియు 10సంవత్సరాల బాండ్ దిగుబడి 4.5శాతం కంటే ఎక్కువగా పెరగడం వల్ల బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి. డాలర్ విలువ పెరగడం ఇన్వెస్టర్లకు బంగారాన్ని మరింత ఖరీదైనదిగా చేస్తుంది. తద్వారా ధరలు తగ్గడానికి కారణం అవుతుంది.
♦ అమెరికా, చైనా మధ్య సుంకాలను తగ్గించే ఒప్పందం ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించింది. దీని కారణంగా ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధరలు తగ్గేందుకు కారణం అవుతుంది.
♦ ఈ ఏడాది ఏప్రిల్ లో బంగారం ధరలు 10గ్రాములు రూ.లక్ష దాటేశాయి. ఇప్పుడు పెట్టుబడిదారులు లాభాల కోసం బుకింగ్ ప్రారంభించారు. దీని కారణంగా మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి.. ధరలు తగ్గుతున్నాయి.
♦ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో పెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు బంగారం నుండి డబ్బును ఉపసంహరించుకుని షేర్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. దీని కారణంగా బంగారం డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.