×
Ad

‘ప్రధాన్ మంత్రి కౌశల్ ముద్ర యోజన’ వచ్చేస్తుంది..! రెడీగా ఉన్నారా? మీకు ఏమేం ఇస్తారంటే?

ప్రధాన్ మంత్రి కౌశల్ ముద్ర యోజన అంటే నైపుణ్య శిక్షణకు రుణాలు, వడ్డీ రాయితీలు, ఆర్థిక సాయం అందించే ప్రతిపాదిత కేంద్ర పథకం.

కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. సాధారణంగా ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సారి.. దేశంలోని నైపుణ్యాభివృద్ధి రంగాన్ని పునర్‌వ్యవస్థీకరించే ఉద్దేశంతో కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఈ పథకానికి ప్రధాన్ మంత్రి కౌశల్ ముద్ర యోజన (పీఎంకేఎంవై) పేరు పెడుతున్నారు. ఈ పథకం ద్వారా నైపుణ్య శిక్షణకు ఆర్థిక సాయం అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యేకంగా మహిళలు, గ్రామీణ యువత, వికలాంగులకు ప్రయోజనాలు చేకూర్చడం దీని ఉద్దేశం.

ప్రధాన్ మంత్రి కౌశల్ ముద్ర యోజన అంటే?

నైపుణ్యాలను పెంపొందించడానికి ఆర్థిక సాయం అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నాణ్యతతో కూడిన శిక్షణను పొందడానికి ఈ పథకం ద్వారా సాయం చేస్తారు. శిక్షణకు సంబంధించిన ఫీజులు కట్టలేక, ఆయా ప్రోగ్రామ్‌లకు దూరంగా ఉంటున్న వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.

ఈ పథకం ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉండనుంది. భవిష్యత్‌లో వచ్చే టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. వెనుకబడిన వర్గాలు, ప్రాంతాలకు రుణ గ్యారెంటీలు, వడ్డీ రాయితీలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది.

Also Read: 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ.. ప్రకటించిన సీఈసీ.. ప్రతి ఇంటికీ వెళ్లి.. ఏం చేస్తారంటే?

ప్రధానంగా వీటిపై దృష్టి 

భారత్‌లో వేగంగా ఎదుగుతున్న రంగాలపై పీఎంకేఎంవై దృష్టి కేంద్రీకరిస్తుంది. అధిక వృద్ధి, అధిక డిమాండ్‌ ఉన్న రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం తోడ్పడుతుంది. అవి..

  • పునరుత్పాదక శక్తి
  • సెమీకండక్టర్లు
  • ఎలక్ట్రిక్ వాహనాలు
  • రక్షణ రంగ తయారీ
  • అధునాతన సాంకేతికత, ఆటోమేషన్

ఈ రంగాలపై దృష్టి సారించడం ద్వారా స్వావలంబన (ఆత్మనిర్భర్‌), భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేసే లక్ష్యం (వికసిత్‌ భారత్‌) వైపుగా వేగంగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం.

నైపుణ్యాల పెంపునకు ఆర్థిక సాయం

ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎంఎస్‌డీఈ) మంత్రిత్వ శాఖ తుదిదశకు తీసుకెళుతోంది. నైపుణ్య శిక్షణకు ఆర్థిక సాయం ముఖ్యమని ఇది గుర్తిస్తోంది. అధికారులు భారత్‌లో నైపుణ్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై పని చేస్తున్నారు. రుణాల పరిశీలనను సులభతరం చేయడం, సమాచార సేకరణను మెరుగుపరచడం ద్వారా మరింత సమర్థంగా లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలు చేస్తారు.

భారత్‌లో 35 ఏళ్లలోపు వయసు ఉన్న వారు 65 శాతం ఉన్నారు. అయినప్పటికీ నైపుణ్య లోటు ప్రధాన సమస్యగా ఉంది. పీఎంకేఎంవై ద్వారా ప్రభుత్వం శిక్షణ పొందేవారి సంఖ్యను పెంచుతుంది.