12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ.. ప్రకటించిన సీఈసీ.. ప్రతి ఇంటికీ వెళ్లి.. ఏం చేస్తారంటే?

ఎస్‌ఐఆర్‌ ద్వారా నకిలీ ఓట్లను తొలగిస్తారు. రెండో దశలో తెలుగు రాష్ట్రాలు లేవు.

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ.. ప్రకటించిన సీఈసీ.. ప్రతి ఇంటికీ వెళ్లి.. ఏం చేస్తారంటే?

Updated On : October 27, 2025 / 5:12 PM IST

SIR: దేశ వ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)లో భాగంగా రెండో దశలో ఆ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. జాబితా ప్రకటించాక ప్రతి ఒక్కరికీ అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.

రెండో దశ ఎస్‌ఐఆర్‌లో తెలుగు రాష్ట్రాలు లేవు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు లిస్టును పరిశీలిస్తారు. ఇప్పటికే బిహార్‌లో ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెద్ద దుమారమే చెలరేగింది.

ఈ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌

Also Read: “మొంథా” తుపాను.. నేడు, రేపు, ఎల్లుండి.. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండనుందంటే?

బిహార్‌లో తొలుత ఆధార్‌ మినహా 11 గుర్తింపు కార్డులను అధికారులు ఓటరు నమోదుకు ప్రామాణికంగా తీసుకున్నారు. అనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకుని ఆధార్‌ కార్డు కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ఇప్పుడు నిర్వహించే ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే వస్తాయి. ఎస్‌ఐఆర్‌ ద్వారా నకిలీ ఓట్లను తొలగిస్తారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణే ప్రధాన ఉద్దేశం.

ఈ ఓటరు జాబితా ప్రక్షాళనకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఇప్పటికే ఈసీ కోరింది. ఇప్పటికే ప్రచురించిన రాష్ట్రాల లిస్టును కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికల వేడి ఉంది. వచ్చే ఏడాది అసోం, కేరళతో పాటు పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరగనున్నాయి.

“ఎస్‌ఐఆర్‌ జరగనున్న రాష్ట్రాల ఓటరు జాబితాను ఇవాళ రాత్రి 12 గంటలకు ఫ్రీజ్ చేస్తాం. ఆ జాబితాలో ఉన్న ప్రతి ఓటరుకి బీఎల్‌ఓలు యూనిక్ ఎన్యుమరేషన్ ఫాం ఇస్తారు. వాటిలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు ఉంటాయి. బీఎల్‌ఓలు ఈ ఫాంలను ప్రస్తుత ఓటర్లకు పంపిణీ చేసిన తర్వాత, పేర్లు ఉన్నవారు 2003 ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా?

అన్న విషయాన్ని సరిపోల్చుకోవాలి. ఉంటే అదనపు పత్రాలు ఇవ్వనవసరం లేదు. వారి పేర్లు లేకపోయినా తల్లిదండ్రుల పేర్లు ఆ జాబితాలో ఉంటే కూడా అదనపు పత్రాలు ఇవ్వనవసరం లేదు. 2002 నుంచి 2004 వరకు ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా http://voters.eci.gov.in లో అందుబాటులో ఉంటుంది, ఎవరైనా స్వయంగా పరిశీలించి సరిపోల్చుకోవచ్చు” అని జ్ఞానేశ్‌ కుమార్‌ వివరించారు.