Buy Term Insurance : ప్రతి నెలా కేవలం రూ. 36 సేవ్ చేయండి.. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి.. కష్ట సమయాల్లో మీ కుటుంబాన్ని ఆదుకుంటుంది!
Buy Term Insurance : కొత్త టర్మ్ పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ప్రతి నెలా రూ.36 ఆదా చేసుకోండి. ఆ డబ్బులతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు ఈ డబ్బులే మీ కుటుంబానికి అండగా నిలుస్తాయి.

Buy Term Insurance
Buy Term Insurance : ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికి టర్మ్ పాలసీ తప్పక ఉండాలి. కష్ట సమయంలో వారికి ఏమైనా అయితే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. మీరు లేనప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది.
సాధారణంగా సామాన్యులు కొంటారు. కానీ, పేదవారు ఈ టర్మ్ పాలసీని కొనలేరు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టర్మ్ పాలసీ ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయొచ్చు.
జీవితంలో ఎవరికి ఎలాంటి పరంగా డబ్బు అవసరం పడుతుందో చెప్పలేం. అందుకే ప్రతి వ్యక్తి ఊహించని పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. ఈ కష్ట సమయాల్లో కుటుంబానికి ఆరోగ్య బీమా, టర్మ్ బీమా, జీవిత బీమా మొదలైనవి అద్భుతంగా సాయపడతాయి. అయితే, ప్రీమియంలు చాలా ఖరీదైనవి. ఇలాంటి పథకాలను పేదలు కొనుగోలు చేయలేరు.
అలాంటి వారి కోసం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రభుత్వం అందించే ఈ పథకం ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. నెలకు రూ. 5వేల నుంచి రూ.10వేలు సంపాదించేవారు కూడా సులభంగా టర్మ్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకోండి.
నెలలో రూ. 36 ఆదాతో టర్మ్ పాలసీ తీసుకోండి :
ఈ ప్రభుత్వ పథకం కింద పాలసీదారుడు మరణిస్తే.. ఆ వ్యక్తి కుటుంబానికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ ఆర్థిక సాయం కష్ట సమయాల్లో కుటుంబ ఖర్చులను భరించవచ్చు. ఎవరైనా ఈ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. సంవత్సరానికి కేవలం రూ. 436 చెల్లించి ఈ పథకాన్ని (436/12=36.3) కొనుగోలు చేయాలి. ఒక వ్యక్తి ప్రతి నెలా రూ. 36 ఆదా చేసినా వార్షిక ప్రీమియంను సులభంగా చెల్లించవచ్చు.
ఈ ప్లాన్‌ను ఎవరు కొనుగోలు చేయాలి? :
18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కొనుగోలు చేయవచ్చు. (PMJJBY) బీమా పథకం కింద కవర్ వ్యవధి జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. అంటే మీరు సంవత్సరంలో ఏ నెలలోనైనా ఈ టర్మ్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. కానీ, మీరు మే 31 వరకు మాత్రమే కవరేజ్ పొందుతారు.
మీరు జూన్ 1న మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందాలంటే బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. ఈ పథకం కింద రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు ఆటోమేటిక్ రెన్యూవల్‌ను ఎంచుకుంటే.. ప్రతి ఏడాది మే 25 నుంచి మే 31 మధ్య పాలసీలోని రూ. 436 మీ అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా కట్ అవుతుంది.
వైద్య పరీక్షలు అవసరం లేదు :
ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. బీమా పాలసీ సమ్మతి పత్రంలో కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. మీరు ఆ అనారోగ్యాలతో బాధపడటం లేదని డిక్లరేషన్‌లో పేర్కొనాలి. మీరు చెప్పింది తప్పు అని రుజువైతే.. మీ కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం లభించదు. దాంతో పాటు ఈ పథకంలో బీమా ప్రీమియంగా జమ చేసిన మొత్తంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
ఎలా సద్వినియోగం చేసుకోవాలి? :
మీరు ఈ టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటే.. మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి ఫారమ్ పొందవచ్చు. ఈ ఫారమ్ ద్వారా పాలసీ కోసం తన అకౌంట్ నుంచి డబ్బును చెల్లించేందుకు ఖాతాదారుడు సిద్ధంగా ఉన్నాడా లేదా అనే దాని గురించి సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తరువాత, బ్యాంకు మిగిలినవి పూర్తి చేస్తుంది. ఇది కాకుండా, కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా మరికొన్ని SMS ద్వారా ఈ పాలసీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
పథకంలో రిజిస్టర్ నిబంధనలివే :
భారత ప్రభుత్వానికి సంబంధించిన ఈ పథకంలో మీరు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే.. మీ దగ్గర ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఉండాలి. మీ గుర్తింపు ఆధార్ ద్వారా ధృవీకరించిన బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి.
మీ బ్యాంకు అకౌంట్లలో ఒకదాని ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు. దాంతో పాటు, ఈ పాలసీని మరే ఇతర ఖాతాకు లింక్ చేయకూడదు. పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాత మాత్రమే బీమా కవరేజీ ప్రయోజనాలు వర్తిస్తాయి. అయితే, ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే మాత్రం 45 రోజుల షరతు వర్తించదు.
నామినీ ఎలా క్లెయిమ్ చేయాలి? :
సంబంధిత వ్యక్తి బీమా చేసుకున్న బ్యాంకులో నామినీ తప్పక క్లెయిమ్ చేసుకోవాలి. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. డిశ్చార్జ్ రిసిప్ట్‌తో పాటు ఇతర అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. నిబంధనల ప్రకారం.. ప్రమాదం జరిగిన 30 రోజులలోపు క్లెయిమ్ చేయడం చాలా అవసరమని గమనించాలి.