ఈ పనిచేయకపోతే మీ ఇంటికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు.. తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ ఉంది..
ఇంటి యజమాని పాన్ నంబర్‌ను టీడీఎస్ చలాన్‌లో అద్దెకట్టేవారు పేర్కొనాల్సి ఉంటుంది.

హౌస్ రెంట్ అల్లోవెన్స్ (HRA) కింద పన్ను మినహాయింపు పొందేందుకు ట్యాక్స్ రిటర్న్స్‌లో కొన్నేళ్ల నుంచి క్లెయిమ్ చేసుకుంటూ ఆ రెంట్‌పై టీడీఎస్ కట్టనివారు ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకుంటున్నారు.
గత ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)లో పన్ను చెల్లింపుదారులు చేసిన హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్స్‌ను ఆదాయ పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే, పన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే సమయంలో తప్పుగా ఆ వివరాలు పేర్కొంటే వాటిని సరిదిద్దుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు.
తప్పులను సరిదిద్దుకుని కొత్తగా ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి మార్చి 31 వరకే సమయం ఉంది. టీడీఎస్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? నోటీసు అందితే పన్ను చెల్లింపుదారులు ఏమి చేయాలో చదవండి..
చట్టం ఏం చెబుతోంది?
ఐటీ చట్టంలోని సెక్షన్ 194-I కింద.. ఇంటి యజమానికి ఎవరైనా నెలకు రూ.50,000 కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్నట్లయితే ఆ వ్యక్తి ఆ రెంట్ మొత్తంపై 2 శాతం డబ్బును తక్కువగా చెల్లించాలి.
ఆ 2 శాతం డబ్బును టీడీఎస్ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. గత సంవత్సరం అక్టోబర్ వరకు ఈ టీడీఎస్ శాతం 5గా ఉంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేసుకుని, చెల్లించిన అద్దెపై ప్రభుత్వానికి టీడీఎస్ చెల్లించకపోతే ఆ క్లెయిమ్ చెల్లదు.
ఇంటి యజమాని పాన్ నంబర్‌ను టీడీఎస్ చలాన్‌లో అద్దెకట్టేవారు పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ పేర్కొనకపోతే లేదా ఆ పాన్ పనిచేయకపోతే సెక్షన్ 206AA కింద అద్దెపై టీడీఎస్‌ను 20 శాతానికి తగ్గిస్తారు. ఒకవేళ ఇంటి యజమాని ప్రవాస భారతీయుడైతే ఈ టీడీఎస్ 30 శాతంగా ఉంటుంది.
పన్ను చెల్లింపుదారుడు గతంలో హెచ్‌ఆర్‌ఏను తప్పుగా క్లెయిమ్ చేసి ఉంటే మార్చి 31లోపు కొత్త ఐటీఆర్‌ను దాఖలు చేయడం మంచిది.