Operation Sindoor Strike : ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్.. భారత స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఫుల్ డిటెయిల్స్..!
Operation Sindoor Strike : పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దాడికి దిగింది. ‘ఆపరేషన్ సిందూర్’దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

Operation Sindoor Strike
Operation Sindoor Strike : భారత్ దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.
‘ఆపరేషన్ సిందూర్’పాకిస్తాన్ పెట్టుబడిదారులలో భయాందోళనలను రేకిత్తించింది. దాంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుదేల్ అయింది.
బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో పాకిస్తాన్ కీలక స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 (KSE100) 6,272 పాయింట్లు (5.5శాతం) పడిపోయింది. మంగళవారం ముగింపు 113,568.51తో పోలిస్తే 107,296.64 కనిష్ట స్థాయికి చేరుకుంది.
భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ఎఫెక్ట్ పాక్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్లలో మాత్రం పెద్దగా పెరుగుదల కనిపించలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో భారతదేశం వైమానిక దాడి తర్వాత స్టాక్ మార్కెట్‌లో పరిస్థితి ఏంటి? సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో భారత మార్కెట్లు ఈరోజు బలహీనంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80వేల పాయింట్లకు పైన ప్రారంభమైంది. నిఫ్టీ 24,300 దగ్గర కొనసాగింది.
భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున ఈరోజు మార్కెట్ ఒత్తిడిలో కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో జాబితా అయిన 30 కంపెనీలలో హెచ్‌సిఎల్ టెక్, ఆసియన్ పెయింట్స్, హిందుస్తాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్. నెస్లే నష్టాలను చవిచూశాయి.
సెన్సెక్స్ రోజులో గరిష్టంగా 80,844.63, కనిష్టంగా 79,937.48 పాయింట్లను తాకగా, నిఫ్టీ 24,449.60 గరిష్టంగా, 24,220 కనిష్టంగా ముగిసింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణి దాడులు చేసిన తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ భారీ అస్థిరతను చూశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్ భారీ హెచ్చుతగ్గులను చవిచూసింది.
టాటా పవర్ షేరు ధర రూ. 379.50. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ స్టాక్ దాదాపు 1.23 శాతం లాభపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, షాంఘై ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ లాభాల్లో ఉండగా, జపాన్‌కు చెందిన నిక్కీ 225 నష్టాల్లో ఉన్నాయి.
రక్షణ రంగ స్టాక్ సూచీల జోరు :
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బుధవారం రక్షణ రంగ స్టాక్‌లు భారీగా పెరిగాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి, రక్షణ, జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న కంపెనీలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.
ఈ జాబితాలో మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ అగ్రస్థానంలో ఉంది. 1.92శాతం పెరిగి రూ. 3,029.60కి చేరుకుంది, 2 మిలియన్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. డేటా ప్యాటర్న్స్ (ఇండియా) లిమిటెడ్ 1.56శాతం పెరిగి రూ. 2,229కి చేరుకుంది.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 0.77శాతం పెరిగి రూ.1,494.10 వద్ద ముగిసింది, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 0.33శాతం పెరిగి రూ.4,522.00 వద్ద ముగిసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 0.10శాతం పెరిగి రూ.1,529.20 వద్ద ముగిసింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో రక్షణ వ్యయం పెరగడం, భారత రక్షణ తయారీదారులకు సానుకూల ప్రభావం ఉంటుందని పెట్టుబడిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : BSNL Special Offer : BSNL స్పెషల్ ఆఫర్.. ఈ 3 రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గింపు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
కానీ, ప్రారంభ నష్టాల నుంచి సెన్సెక్స్ కోలుకుని 150 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్, రక్షణ, ఆటో స్టాక్‌ల లాభాలతో నిఫ్టీ 24,400 మార్కును అధిగమించింది.