Retirement Plan Tax : ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా సంపాదన.. పన్ను పరంగా రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి? టాప్ 5 మార్గాలివే..!
Retirement Plan Tax : రిటైర్మెంట్ పెట్టుబడులపై ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 12లక్షలకు పైగా ఆదాయంపై రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలంటే?

Retirement Plan Tax
Retirement Plan Tax : రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? ఇందుకోసం మీ సంపాదనలో కొద్ది మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ చేయడం (Retirement Plan Tax) గతంలో చాలా ఈజీగా ఉండేది. కానీ, రానురాను పన్ను విధానాల్లో మార్పులు సంభవించాయి. గత కొన్ని ఏళ్లుగా రిటైర్మెంట్ పన్ను నియమాలలో అనేక సవరణలు జరిగాయి. చాలావరకు రిటైర్మెంట్ ప్లాన్లు ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చేశాయి.
మీరు ఏడాదికి రూ. 12 లక్షల వరకు సంపాదిస్తే.. కొత్త పన్ను విధానంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. కానీ, మీ ఆదాయం ఏడాదికి రూ. 12 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పన్ను పరంగా ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్లను ఎంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్ :
స్టాక్స్, ఈక్విటీ-ఆధారిత ఫండ్స్ నుంచి దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇప్పుడు 12.5శాతం పన్ను విధిస్తారు. కానీ, చిన్న పెట్టుబడిదారులు పన్ను పడకుండా ఉండాలంటే రూ. 1.25 లక్షల పన్ను రహిత పరిమితి ఉంది. అంటే.. లాభాలతో అదే స్టాక్‌లను లేదా మ్యూచువల్ ఫండ్‌లను తిరిగి కొనుగోలు చేస్తుండాలి. తద్వారా ప్రతి ఏడాదిలో రూ. 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక లాభాలను పొందవచ్చు.
2. యులిప్స్ (Ulip Plans) :
ఫిబ్రవరి 1, 2021 తర్వాత కొనుగోలు చేసిన పాలసీల మొత్తం ప్రీమియం రూ.2.5 లక్షలు దాటితే యులిప్‌ల (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు) మెచ్యూరిటీ ఆదాయంపై పన్ను విధిస్తారు. పన్ను పడకుండా ఉండాలంటే యులిప్‌లలో పెట్టుబడులను ఏడాదికి రూ.2.5 లక్షలకు పరిమితం చేయాలి. రిటైర్మెంట్ కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తే.. మ్యూచువల్ ఫండ్స్ లేదా NPS పథకాలను ఎంచుకోండి. NPS పెట్టుబడులతో ఎక్కువ పన్ను ఆదా చేయొచ్చు.
3. సాంప్రదాయ బీమా పాలసీలు :
31 మార్చి 2023 తర్వాత కొనుగోలు చేసిన పాలసీల మొత్తం ప్రీమియం రూ. 5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే జీవిత బీమా పథకాల మెచ్యూరిటీ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించాల్సి వస్తుంది. సాంప్రదాయ బీమా పథకాలలో రూ. 5 లక్షల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టవద్దు. మీరు మరింత పెట్టుబడి పెట్టవలసి వస్తే.. డెబ్ట్ ఫండ్స్, NPS వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడమే మంచిది.
4. డెబ్ట్ ఫండ్స్ :
డెబ్ట్ ఫండ్ల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక లాభాల మధ్య పెద్దగా తేడా ఉండదు. ఈ ఫండ్ల ద్వారా ఇండెక్సేషన్ బెనిఫిట్స్ కూడా పొందలేరు. ఎందుకంటే.. లాభాలన్నీ ఆదాయంలోనే ఉంటాయి. స్లాబ్ రేట్లతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయినప్పటికీ, డెబ్ట్ ఫండ్లతో పన్ను చెల్లింపు నుంచి బయటపడొచ్చు. మీరు రిడీమ్ చేసినప్పుడు మాత్రమే లాభాలపై పన్ను విధిస్తారు. అందుకే డెబ్ట్ ఫండ్లలో క్రమంగా పెట్టుబడి పెడుతుండాలి. తద్వారా మీ ఆదాయం, పన్ను బాధ్యత తక్కువగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ తర్వాత రిడీమ్ చేసుకోగలరు.
5. ప్రావిడెంట్ ఫండ్ (EPFO) :
ప్రావిడెంట్ ఫండ్ అనగానే పన్ను రహితమని భావిస్తారు. కానీ, 3 ఏళ్ల క్రితమే ఈపీఎఫ్‌కు ఏడాదికి రూ. 2.5 లక్షలకు మించి కాంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీని పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. టాక్స్ లేకుండా ఉండాలంటే ఏడాదికి రూ. 2.5 లక్షలకు కాంట్రిబ్యూషన్ పరిమితం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు PPF అకౌంట్ ఓపెన్ చేయాలి. టాక్స్ పడకుండా ఉండేందుకు డెబ్ట్ ఫండ్స్ ఎంచుకోవచ్చు.