Hyderabad: రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్లకు భారీ డిమాండ్.. ఎందుకో తెలుసా!

ప్రస్తుతం హైదరాబాద్‌లో యేడాదికి ఇళ్ల అమ్మకాలు సుమారు 30 వేలు ఉండగా వచ్చే రెండేళ్లలో క్రమంగా పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.

Hyderabad

Hyderabad Population: ప్రపంచంలో పట్టణ, నగర జనాభా రోజురోజుకి పెరిగిపోతోంది. విద్యా, ఉగ్యోగం, ఉపాధి అవకాశాల కోసం జనం పల్లెలు, గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు చేరుతున్నారు. దీంతో పల్లెలు ఖాళీ అవుతుండగా పట్టణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో తెలంగాణలో పట్టణ, నగర జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశ జనాభాలో 35.1 శాతం పట్టణ, నగర జనాభా ఉంటే, తెలంగాణలో ఇది 47.6 శాతంగా నమోదైంది. 2036 నాటికి అర్బన్‌ జనాభా జాతీయ స్థాయిలో 39.1 శాతానికి చేరితే, తెలంగాణలో 57.3 శాతానికి పెరుగుతుందని నేషనల్ పాపులేషన్ రిపోర్ట్-2023 అంచనా వేసింది. తెలంగాణలో అర్బన్‌ జనాభా దేశంలోనే అత్యధికంగా 18శాతం పెరుగుతుందని వెల్లడించింది. తెలంగాణలో 2014లో అర్బన్‌ పాపులేషన్‌ 39 శాతం కాగా, 2023 చివరి నాటికి 47.61శాతానికి, 2025 నాటికి 50శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

తెలంగాణలో పట్టణ, నగర జనాభా శాతం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ మొత్తం జనాభాలో సగానికి పైగా మంది పట్టణాలు, నగరాల్లోనే ఉంటారని నేషనల్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌ 2023 అంచనా వేసింది. అర్బన్‌ జనాభా శాతం జాతీయ సగటు కంటే తెలంగాణలో 12 శాతం అధికంగా ఉంది. గత తొమ్మిదేళ్లలోనే ఏకంగా 8.61 శాతం జనం పల్లెలను వదిలి పట్టణాలకు చేరారు. ఇది వచ్చే రెండేళ్లలో మరింత పెరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌ నగరాల్లో జనాభా పెరుగుదల రేటు భారీగా ఉండొచ్చని నేషనల్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌-2023లో అంచనా వేశారు. హైదరాబాద్‌ మహానగర జనాభా వచ్చే రెండేళ్లలో కోటికి మించిపోతుందని, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్‌ 35 మహా నగరాల జాబితాలో చేరుతుందని అభిప్రాయపడింది.

తెలంగాణ జిల్లాలతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా వేగంగా జరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాభివృద్ధి కోసం రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో లక్షా 21వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నిధులతో రహదారులు, ప్రజారవాణా, మంచినీరు, మురుగు నీటి శుద్ధి వంటి మౌళిక వసతులను అభివృద్ది చేశారు. ఐతే రానున్న రోజుల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో మౌళిక వసతులు మరింతగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: హైదరాబాద్‌ బుద్వేల్‌ వెంచర్‌కు భారీ డిమాండ్.. అందుబాటు ధరల్లో గృహాలు!

ఇక పెరుగుతున్న హైదరాబాద్ జనాభాకు అనుగునంగా నివాస గృహాలకు భారీగా డిమాండ్ పెరగనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో యేడాదికి ఇళ్ల అమ్మకాలు సుమారు 30 వేలు ఉండగా వచ్చే రెండేళ్లలో క్రమంగా పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. అయితే డిమాండ్‌కు అనుగుణంగా ఇళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశముందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న భూముల ధరలు, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు.

Also Read: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై మిడిల్ క్లాస్ ఆశలు.. రూ.30-45 లక్షల రేంజ్ అయితే ఓకే!

అందుకే హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్న వారు తమ తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలను మొదలుకొని ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఇంటి కొనుగోలు అవకాశాలను పరిశీలించుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చదరపు అడుగు సగటున 4 వేల 850 రూపాయలు ఉండగా అది రెండేళ్లలో 7 వేల రూపాయలకు చేరే ఛాన్స్‌ ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, ఇల్లు కొనుగోలుకు ఇదే సరైన సమయమని సజెస్ట్‌ చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

ట్రెండింగ్ వార్తలు