Affordable Housing : అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై మిడిల్ క్లాస్ ఆశలు.. రూ.30-45 లక్షల రేంజ్ అయితే ఓకే!

ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.

Affordable Housing : అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై మిడిల్ క్లాస్ ఆశలు.. రూ.30-45 లక్షల రేంజ్ అయితే ఓకే!

Affordable housing for urban middle class families

Affordable Housing – Middle Class : ఎక్కడో ఓ చోట.. ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును కలిగివుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి (Lower Middle Class) వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని, బ్యాంకుల నుంచి రుణాలు (Banl Loan) తీసుకుని సొంతింటి కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాల ధరలు (house land rates), గృహాల ధరలు (housing rates) విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ (Hyderabad) లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు కావాల్సిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్య తరగతివారికి అందుబాటులో లేకుండాపోయాయి.

ప్రస్తుతం అఫర్డబుల్‌ ప్రైస్‌లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50 వేల రూపాయల వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇల్లు కొనుగోలుకు ధైర్యం చేయడం లేదు.

అందరికీ ఇల్లు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ముఖ్యంగా అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టే బిల్డర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది. రెసిడెన్షియల్ యూనిట్ ఒక్కొక్కటి మెట్రో నగరాలైతే 60 చదరపు మీటర్లు, నాన్‌ మెట్రో ప్రాంతాలైతే 90 చదరపు మీటర్లకు మించకుండా ఉండే వాటిని అఫర్డబుల్ ప్రాజెక్టుల క్రింద గుర్తిస్తోంది. ప్రాపర్టీ స్టాంప్ విలువ 45 లక్షల రూపాయలకు మించని ఇళ్లకు కేంద్రం పలు రాయితీలు అందిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే వచ్చే లాభాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొనుగోలుదారులు అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా జీఎస్టీ 5 శాతం చెల్లించాలి. కానీ అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్టీ కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుంది. అంతే కాదు ఆదాయ పన్ను నుంచి భారీ మినహాయింపులు పొందుతారు. హోం లోన్‌పై ఇన్‌కమ్ టాక్స్ సెక్షన్-24 ద్వారా సాధారణంగా 2 లక్షల రూపాయల మేర వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపుగా చూపవచ్చు. అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టులు రావడం లేదు.

Also Read: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్‌

ముఖ్యంగా హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో కూడా 45 లక్షల పైబడి ప్రాజెక్టులే తప్ప అఫర్డబులిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. గ్రేటర్ సిటీలో ఏకంగా అందుబాటు ధరల విభాగంలోని ఇళ్ల అమ్మకాల్లో 50 శాతానికి పైగా క్షీణత నమోదైందని అనరాక్ తన నివేదికలో ప్రకటించింది. ఈ ప్రైస్‌ రేంజ్‌లో 2022 జనవరి-జూన్‌ మధ్య కాలంలో 1,460 అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇదే కాలంలో 720 ఇళ్లే అమ్ముడయ్యాయని తెలిపింది. ఇందుకు కారణం అసలు మార్కెట్‌లో 40 లక్షల లోపు ఇళ్లు నిర్మాణం జరుపుకోవడం లేదని చెబుతున్నారు. 30 లక్షల రేంజ్ నుంచి 45 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజార్టీ సంఖ్యలో ఉన్న మధ్య తరగతి వార సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణరంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది.

Also Read: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ రాయితీలతో భూములను ఇచ్చి అఫర్డబుల్ హౌజింగ్ ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.