Gold Imports : గోల్డ్ గిరాకీ.. అక్టోబర్ నెలలో దేశంలో పసిడి దిగుమతులు ఎంత పెరిగాయో తెలుసా.. బాబోయ్..! పూర్తి గణాంకాలు ఇవే..

Gold Imports :సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో దేశీయంగా బంగారం దిగుమతులు..

Gold Imports : గోల్డ్ గిరాకీ.. అక్టోబర్ నెలలో దేశంలో పసిడి దిగుమతులు ఎంత పెరిగాయో తెలుసా.. బాబోయ్..! పూర్తి గణాంకాలు ఇవే..

Gold imports

Updated On : November 17, 2025 / 9:13 PM IST

Gold Imports : బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన ధరలు.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్, వెండి ధరలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అయితే, బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ అక్టోబర్ నెలలో ఏకంగా 200శాతం దిగుమతులు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.

సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో దేశీయంగా బంగారం దిగుమతులు 14.72 బిలియన్ డాలర్లు (రూ.1.30లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. గతేడాది (2024 సంవత్సరం) అక్టోబర్ నెలలో ఇవి కేవలం 4.92 బిలియన్ డాలర్లు (43.6వేల కోట్లు) దిగుమతులు మాత్రమే జరిగాయి. అక్టోబర్ నెలలో దీపావళి సహా పండుగ సీజన్ బంగారం గిరాకీ ఎక్కువగా ఉండటం, అధిక ధరలు కారణంగా పసిడి దిగుమతులు ఏకంగా 200శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో ధరలు అధికంగానే ఉన్నాయని, ఫలితంగా డిమాండ్ నెమ్మదించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోవైపు వెండి దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. రూ.3,810 కోట్లు నుంచి ఈ ఏడాది అక్టోబర్ నెలలో రూ. 24వేల కోట్లకు పైగా పెరిగాయి. బంగారం, వెండి విలువైన లోహాల దిగుమతుల కారణంగా అక్టోబర్ నెలలో దేశ వాణిజ్య లోటు అత్యధికంగా 41.68 బిలియన్ డాలర్ల (రూ.3.7లక్షల కోట్ల)కు చేరింది.

బంగారం, వెండి దిగుమతులలో పెరుగుదల వాణిజ్య లోటు పెరగడానికి ఒక కారణమని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సెప్టెంబర్ 2025 వరకు బంగారం దిగుమతులు తక్కువగా ఉండటంతో బంగారం డిమాండ్ తగ్గింది. అక్టోబర్‌లో ఇది రివర్స్ అయిందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు.

2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య బంగారం దిగుమతులు 299.77 టన్నుల విలువైన 26.51 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది (2024 సంవత్సరం) ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య 401.27 టన్నులు 29.04 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, రాబోయే నెలల్లో బంగారం డిమాండ్ తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.