Gold prices: ఈ ఏడాది బంగారం ధరలు ఎంత పెరగనున్నాయో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో సురక్షిత పెట్టుబడులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Gold prices: ఈ ఏడాది బంగారం ధరలు ఎంత పెరగనున్నాయో తెలుసా?

Updated On : March 3, 2025 / 8:05 PM IST

అంతర్జాతీయంగా గత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే బంగారం ధర 40% కంటే ఎక్కువ పెరిగింది. ఇంతకుముందు ఎన్నడూ లేని రికార్డులను తిరగరాస్తూ ముందుకు సాగుతోంది. గోల్డ్‌మాన్ సాక్స్ రీసెర్చ్ ప్రకారం.. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం వలన అధిక డిమాండ్ పెరిగి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి.

బంగారం ధర $3,100కి చేరే అవకాశముందా?
అతి విలువైన పసిడి ధర మరో 8% పెరిగి 2025 చివరికి ట్రాయ్ ఔన్స్‌కు $3,100 చేరుకుంటుందని ‘గోల్డ్‌మాన్ సాక్స్’ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మునుపటి అంచనా ($2,890) కంటే ఎక్కువ.

ఈ ఏడాది బంగారం ధర పెరుగుదలకి కారణాలు
కేంద్ర బ్యాంకుల అధిక డిమాండ్ : రష్యా 2022లో సెంట్రల్ బ్యాంక్ ఆస్తుల‌ను ఫ్రీజ్ చేసినప్పటి నుండి అనేక దేశాలు బంగారాన్ని రిజర్వ్‌గా పెంచుకోవడం ప్రారంభించాయి. అలాగే 2023 డిసెంబరులో లండన్ OTC గోల్డ్ మార్కెట్‌లో వివిధ దేశాలు కొనుగోలు చేసిన బంగారం 108 టన్నులకు చేరింది. ఇంతకుముందు సగటున 17 టన్నులు కొనేవారు. అంటే దాదాపు 5 రెట్లు పెరిగింది.

బంగారం ETFల కొనుగోళ్లు: వడ్డీ రేట్లు తగ్గినపుడు బంగారం విలువ పెరిగే అవకాశం ఉండటంతో, డిమాండ్ కూడా పెరుగుతుంది. దీనివల్ల బంగారం ETFల కొనుగోళ్లు కూడా పెరుగుతాయి.

ప్రస్తుతం మార్కెట్లో సురక్షిత పెట్టుబడులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ఎక్కువ అవకాశం ఉందని పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెంచుతున్నారు. ఈ అన్ని కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతాయి.

మరింత పెరిగే అవకాశం ఉందా?
ముఖ్యంగా టారిఫ్‌లు, భయాందోళనలు, ప్రభుత్వ అప్పులపై అనిశ్చితి కొనసాగితే 2025 చివరికి ట్రాయ్ ఔన్స్‌కు $3,300 చేరవచ్చు. 70 టన్నుల వరకు కేంద్ర బ్యాంక్లు కొనుగోళ్లు చేస్తే గోల్డ్ రేటు $3,200 చేరుతుందని అంచనా. అమెరికా ప్రభుత్వ అప్పుల పెరుగుదలపై ఆందోళన పెరిగితే బంగారం ధర $3,250 వరకు పెరగవచ్చు.

ధర తగ్గే అవకాశం ఉందా?
అమెరికా సెంట్రల్ బ్యాంకు అయినా ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లు తగ్గించకపోతే బంగారం ధర కేవలం $3,060 మాత్రమే ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల డిమాండ్ అనుకున్నదాని కన్నా ఎక్కువ స్థాయిలో పెరిగితే, ఒకవేళ ఏదైనా ఆర్థిక సంక్షోభం ప్రభావం చూపిస్తే 2025 చివరి నాటికి $3,100 – $3,300 మధ్య ఉండే అవకాశముందని గోల్డ్‌మాన్ సాక్స్ నివేదిక చెబుతోంది. అంతేగానీ, తగ్గే అవకాశాలు లేవని అంచనా.