Gold: బంగారంపై పెట్టుబడి పెడితే కాసుల వర్షం కురిపిస్తుందా.. సెంట్రల్ బ్యాంక్‌లు ఏం చేస్తున్నాయో తెలుసా..

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలను నమోదు చేస్తున్నాయి.

Gold: బంగారంపై పెట్టుబడి పెడితే కాసుల వర్షం కురిపిస్తుందా.. సెంట్రల్ బ్యాంక్‌లు ఏం చేస్తున్నాయో తెలుసా..

Gold Investment

Updated On : March 6, 2025 / 12:16 PM IST

Gold Investment: అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలను నమోదు చేస్తున్నాయి. యూఎస్ డాలర్ బలహీనపడటానికితోడు సురక్షిత సాధనంగా నెలకొన్న డిమాండ్ పసిడి ధరల పెరుగుదలకు మద్దతునిస్తుంది. ప్రస్తుతం భారీగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు సాహసం చేయడం లేదు. అయితే, బంగారంపై పెట్టుబడి కాసుల వర్షం కురిపిస్తోంది. సామాన్య ఇన్వెస్టర్ల నుంచి సెంట్రల్ బ్యాంకుల వరకు బంగారంపై పెట్టుబడితో లాభాలు గడిస్తున్నాయి.

Gold

2024లో లాభాల పంట..
ఎక్కడైనా ధరలను నిర్ణయించేది డిమాండ్, సరఫరా అనే విషయం తెలిసిందే. బంగారం ఉత్పత్తి గడిచిన కొన్నేళ్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కానీ, అదే సమయంలో డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఆభరణాలు, పెట్టుబడులు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల రూపంలో పసిడికి బలమైన డిమాండ్ కొనసాగుతోంది. 2024 సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులకు డిమాండ్ భారీగా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ ల నుంచి సామాన్య ఇన్వెస్టర్ల వరకు అందరికీ బంగారంపై పెట్టుబడి కాసుల వర్షం కురిపిస్తోంది. 2024లో 27శాతం రాబడితో ఇతర అన్ని సాధానాల కంటే మెరుగైన స్థానంలో బంగారం నిలవడం గమనార్హం.

Gold

రెండు నెలల్లో 12శాతం పెరుగుదల..
2025 సంవత్సరంలోనూ బంగారంపై పెట్టుబడి జోరు కొనసాగుతుంది. రెండు నెలల్లోనే 12శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 2,900 డాలర్లను దాటిపోయింది. దేశీయంగా 10గ్రాముల ధర రూ. 89వేల మార్క్ పైకి చేరుకుంది. జనవరి 1న రూ.79వేల స్థాయిలో ఉండగా.. అక్కడి నుంచి చూస్తే రూపాయి మారకంలోనూ 13శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా రాబడుల్లో బంగారమే ముందుంది. అయితే, గోల్డ్ ర్యాలీ రాబోయే కాలంలోనూ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే.. టారిఫ్ ల విషయంలో ఏ దేశాన్ని విడిచిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు వాణిజ్య యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న భయాలు, సెంట్రల్ బ్యాంకుల రెండు చేతులా కొనుగోళ్లు వెరసి బంగారం ధరలు ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు.

Gold

బంగారంకు ఎందుకంత డిమాండ్..?
కాలం గడిచేకొద్దీ బంగారం విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. ద్రవ్యోల్బణ ప్రభావానికి మించి రాబోయే కాలంలో బంగారం తన స్థాయిని పెంచుకుంటుందని చరిత్ర చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ లు తమ విదేశీ మారకం ఆస్తుల్లో గతంలో ఎన్నడూలేని విధంగా బంగారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమంలో కరెన్సీ విలువ తగ్గుతుంటుంది. దీనికి విరుద్ధంగా బంగారం విలువ పెరుగుతుంది. అందుకే దీన్ని హెడ్జింగ్ సాధనంగా, ఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుంటారు. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడి, 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయాల్లో ఇన్వెస్టర్లు స్టాక్స్, ఇతర సాధానల కంటే బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ బ్యాంకుల నుంచి సామాన్య ఇన్వెస్టర్ల వరకు ఇతర సాధానాల కంటే బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.