తగ్గిన బంగారం ధర

  • Published By: chvmurthy ,Published On : November 18, 2019 / 02:26 AM IST
తగ్గిన బంగారం ధర

Updated On : November 18, 2019 / 2:26 AM IST

దేశీయ మార్కెట్లో ఆకాశాన్నంటిన బంగారం ధరలు గత 2 నెలల్లో రూ.2000 తగ్గింది. 2019, సెప్టెంబర్ మొదటి వారంలో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ.40,000 ఉండగా, శుక్రవారం, నవంబర్ 15 శుక్రవారం నాటికి రూ.38,246 వద్ద నిలిచింది.  అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ఆశవహా ధృక్పధంతో దేశీయ ఇన్వెస్టర్లు  బంగారం కొనుగోళ్ల వ్యవహారంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ  కారణంతోనే  నవంబర్ నెలంతా కూడా బంగారం, వెండి మార్కెట్లు నిస్తేజంగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

నవంబర్ 15, శుక్రవారంనాడు బంగారం ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు 0.77 శాతం తగ్గి రూ.37,971 పలికింది. వెండి కాంట్రాక్టుల ధర కూడా 0.76 శాతం తగ్గి రూ.44,385కి దిగివచ్చింది. గత రెండు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ధరల్లో ఏర్పడుతున్న ఒత్తిడులకు దీటుగానే దేశీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు  మొదట్లో అంతర్జాతీయ మార్కెట్ లో ఆరేళ్ల గరిష్ఠ స్థాయి 1550 డాలర్లు పలికిన ఔన్సు బంగారం ఇప్పుడు 1464.17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణం…..ఇటీవల కాలంలో ప్రపంచ మార్కెట్లు పుంజుకోవటం.. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది. ఔన్సు బంగారం ధర 1480 డాలర్లను బ్రేక్‌ చేస్తే తప్ప మరోసారి ర్యాలీకి ఆస్కారం లేదని విశ్లేషకులు చెపుతున్నారు. ఏదేమైనా అమెరికా, చైనా చర్చలు, బ్రెగ్జిట్‌ వంటి పరిణామాల ప్రభావం వల్ల రానున్న కొద్ది నెలల్లో కూడా బులియన్‌ మార్కెట్‌ నిరాశావహంగానే ఉండవచ్చన్నది వారి అభిప్రాయం. గత రెండు నెలల్లో బంగారం ధర భారీగా తగ్గినప్పటికీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 14 శాతం వృద్ధి నమోదైంది. ఇదేకాలంలో భారత దేశంలో బంగారం ధర 20 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో ఈధర మరింత తగ్గే అవకాశం ఉందని, జనవరి నాటికి భారీగా ధరలు తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.