Reliance AGM Event : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఏఐ-క్లౌడ్ స్టోరేజీ వెల్‌కమ్ ఆఫర్.. ఇకపై 100జీబీ వరకు స్టోరేజీ ఉచితం..!

Free 100 GB Storage Under Jio AI-Cloud Welcome Offer ( Image Source : Google )
Reliance AGM Event : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు (ఆగస్టు 29) రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అపర కుబేరుడు అంబానీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ వెల్‌కమ్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి నుంచి జియో తన యూజర్లకు 100జీబీ ఉచిత ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను అందించనున్నట్లు వెల్లడించారు. కొత్త క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ జియో ఏఐ వెల్‌కమ్ క్లౌడ్‌ను ప్రారంభించే ప్లాన్లను కూడా అంబానీ ఆవిష్కరించారు.
“జియో ఏఐ-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. జియో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లతో పాటు ఇతర డిజిటల్ కంటెంట్ డేటా మొత్తాన్ని సురక్షితంగా స్టోర్ చేయడం, యాక్సెస్ చేసేందుకు 100జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని పొందవచ్చు.
ఇంకా ఎక్కువ స్టోరేజీ అవసరమయ్యే యూజర్లకు కూడా మార్కెట్‌లో అత్యంత సరసమైన ధరలకే క్లౌడ్ స్టోరేజీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది దీపావళి నుంచి జియో ఏఐ-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్ ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. క్లౌడ్ డేటా స్టోరేజీ, డేటా ఆధారిత ఏఐ సర్వీసులు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా సరసమైన పరిష్కారాన్ని తీసుకురానున్నాం”అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
భారతీయ టెలికాం మార్కెట్లో ఫ్రీ 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్ ద్వారా జియో పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. జియో ఏఐ వెల్‌కమ్ క్లౌడ్ యూజర్లకు అడ్వాన్స్‌డ్ ఏఐ- పవర్డ్ ఫీచర్‌లను అందిస్తుంది. జియో డిజిటల్ సర్వీసుల సూట్‌తో నిరంతరాయంగా సర్వీసులను పొందవచ్చు.