బంగారానికే కాదు.. ఇక వెండికి కూడా హాల్‌మార్కింగ్.. స్వచ్ఛతను ఇలా గుర్తించవచ్చు..
సవరించిన ప్రమాణంలో ఎన్ని స్వచ్ఛత గ్రేడ్లు ఉన్నాయో తెలుసా?

Silver Jewellery
Silver Jewellery: వెండి ఆభరణాలు, వస్తువుల హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతానికి వాలంటరీగా (స్వచ్ఛంద ప్రాతిపదికన)నే దీన్ని తీసుకొచ్చారు. ఈ నిర్ణయం సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది.
వినియోగదారులు లోహ స్వచ్ఛతను నిర్ధారణ చేసుకునేందుకు ఈ డిజిటల్ గుర్తింపు విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) తన హాల్‌మార్కింగ్ ప్రమాణాన్ని సవరించింది.
ఈ సవరణలో వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) బేస్డ్ హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేక సంఖ్య ఇవ్వడం ద్వారా దాని గుర్తింపు సులభతరం అవుతుంది. బంగారం హాల్‌మార్కింగ్ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
వెండి ఆభరణాలు, వస్తువుల విషయంలో వినియోగదారులు సెప్టెంబరు 1 తర్వాత హాల్‌మార్క్ చేసిన వెండి ఆభరణాలపై బీఐఎస్ కేర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వస్తువు రకం, స్వచ్ఛత గ్రేడ్, హాల్‌మార్కింగ్ తేదీ, పరీక్ష కేంద్ర వివరాలు, జువెల్లర్ నమోదు సంఖ్యను గుర్తించవచ్చు.
సవరించిన ప్రమాణంలో 7 స్వచ్ఛత గ్రేడ్లు ఉన్నాయి. అవి 800, 835, 925, 958, 970, 990, 999. వీటిలో 958, 999ను కొత్తగా చేర్చారు. హాల్‌మార్క్ మూడు భాగాలుగా ఉంటుంది. ‘SILVER’ అనే పదంతో BIS ప్రమాణ ముద్ర, స్వచ్ఛత గ్రేడ్, HUID కోడ్ ఉంటాయి.
దేశంలో ప్రస్తుతం 87 జిల్లాల్లో విస్తరించి ఉన్న 230కు పైగా వెండి ఆభరణాల పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రాలు BIS గుర్తింపు పొందాయి. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3.2 మిలియన్లకు పైగా వెండి ఆభరణాల వస్తువులను హాల్‌మార్క్ చేశారు. (Silver Jewellery)