Renault Triber GST: జీఎస్టీ రేట్ కట్ తర్వాత మీకు అత్యంత లాభం చేకూర్చే 7 సీటర్ కార్ ఇదే.. ఎంత తగ్గుతుందంటే..
భారత్‌లో కొత్త GST సంస్కరణలతో రెనాల్ట్ ట్రైబర్ ధర గణనీయంగా తగ్గుతోంది. దీనివల్ల కారు కొనేవారికి వేల రూపాయల నుంచి లక్ష వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా శుభవార్తే.

Renault Triber
Renault Triber: కుటుంబం అంతా కలిసి హాయిగా ప్రయాణించడానికి ఒక పెద్ద కారు కొనాలనుకుంటున్నారా? అయితే, బడ్జెట్ అంతగా లేదని బాధపడుతున్నారా?
అయితే మీలాంటి వారి కోసమే ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల జీఎస్టీ శ్లాబుల్లో వచ్చిన మార్పుల వల్ల ఒక ప్రముఖ 7-సీటర్ కారు ధర గణనీయంగా తగ్గబోతోంది. ఆ కారే రెనాల్ట్ ట్రైబర్. తక్కువ ధరకే 7 సీట్ల కారును దక్కించుకోవచ్చు. ఈ కాంపాక్ట్ ఎంపీవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూద్దాం..
రెనాల్ట్ ట్రైబర్‌కే ఈ అదృష్టం ఎలా వరించింది?
రెనాల్ట్ ట్రైబర్ 7 సీట్ల కారు అయినప్పటికీ కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం “స్మాల్ కార్” (చిన్న కారు) కేటగిరీలోకి వచ్చింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.
పొడవు: ఈ కారు పొడవు 4 మీటర్ల లోపే ఉంటుంది.
ఇంజిన్ కెపాసిటీ: దీనిలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది (నిబంధన ప్రకారం 1.2-లీటర్ల లోపు ఉండాలి).
ఈ రెండు నిబంధనల పరిధిలోకి ఈ ట్రైబర్ రావడం దానికి అతిపెద్ద వరంగా మారింది.
పన్నులో భారీ కోత.. మీ జేబుకు ఎంత ఆదా?
ఇంతకుముందు ఇలాంటి వాహనాలపై 28% జీఎస్టీ ఉండేది. కానీ ఇప్పుడు “స్మాల్ కార్” కేటగిరీలోకి రావడం వల్ల, ట్రైబర్‌పై కేవలం 18% జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. అంటే, నేరుగా 10% పన్ను తగ్గింపు. దీనివల్ల కారు కొనేవారికి వేల రూపాయల నుంచి లక్ష వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా శుభవార్తే.
పోటీలో మిగతా 7-సీటర్ల పరిస్థితి ఏంటి?
మారుతి ఎర్టిగా, కియా కారెన్స్, టయోటా రుమియాన్ వంటి ఇతర ప్రముఖ 7-సీటర్ కార్లు పొడవులో, ఇంజిన్ సామర్థ్యంలో పెద్దవిగా ఉంటాయి. అందుకే అవి “స్మాల్ కార్” కేటగిరీకి అర్హత సాధించలేకపోయాయి. ఫలితంగా, ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వాటికి వర్తించదు.
(గమనిక: మారుతి ఈకోకు కూడా ఈ సౌలభ్యం వర్తిస్తుంది. అయితే, కుటుంబంతో కలిసి కారును వాడుకోవాలనుకుంటున్నవారికి, ఫీచర్ల పరంగా ట్రైబర్ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది)
ధర మాత్రమే కాదు, ఫీచర్లలో కూడా కింగ్
రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) కేవలం ధరకు మాత్రమే కాదు, దాని ఫీచర్లతో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
ఫ్లెక్సిబుల్ సీటింగ్: మూడో వరుస సీట్లను సులభంగా తీసివేయవచ్చు. దీనివల్ల ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది.
అద్భుతమైన స్పేస్: బయటకు చిన్నగా కనిపించినా, లోపల మంచి డిజైన్ వల్ల విశాలమైన స్థలం ఉంటుంది.
తక్కువ మెయింటెనెన్స్: 1.0ఎల్ ఇంజిన్ మంచి మైలేజ్ ఇవ్వడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ.
ఆధునిక ఫీచర్లు: టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 4 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ఫ్యామిలీ కారు కొనాలనుకునే వారికి రెనాల్ట్ ట్రైబర్ ఎప్పటినుంచో మంచి ఆప్షన్‌గా ఉంది. ఇప్పుడు ఈ భారీ పన్ను తగ్గింపుతో ఇది మరింత ఆకర్షిస్తోంది. రాబోయే పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, తగ్గిన ధరలతో రాబోతున్న రెనాల్ట్ ట్రైబర్‌ను తప్పకుండా పరిశీలించండి.