రూ.500 నోట్లను ఏటీఎంలలో పెట్టకూడదని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిందా? నిజం ఇదే..

ఏప్రిల్‌లో విడుదలైన ఒక ఆర్డర్‌ ప్రకారం.. ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్ల అందుబాటును పెంచాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఆర్‌బీఐ సూచించింది.

రూ.500 నోట్లను ఏటీఎంలలో పెట్టకూడదని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిందా? నిజం ఇదే..

Updated On : July 13, 2025 / 6:45 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.500 నోట్ల చలామణీని 2026 మార్చి నాటికి నిలిపేస్తుందని ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందులో నిజంలేదని అధికారికంగా నిర్ధారణ వచ్చేసింది.

వాట్సాప్‌లో వైరల్ అవుతోన్న నకిలీ మెసేజ్‌ ఇదే. “2025 సెప్టెంబర్ 30 నాటికి ఏటీఎంలలో రూ.500 నోట్లు ఉండకుండా చూడాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. దేశంలోని 75 శాతం ఏటీఎంలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పింది. 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో వీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ఇకపై ఏటీఎంల నుంచి రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తాయి.. అందుకే ప్రజలు వెంటనే తమ వద్ద ఉన్న రూ.500 నోట్లు ఖర్చు పెట్టేయాలి” అని ఆ నకిలీ మెసేజ్‌లో ఉంది.

Also Read: సిరాజ్.. కంటి చూపుతో చంపేస్తావా ఏంటి? ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాటర్‌ను ఔట్ చేశాక సిరాజ్ సింహ గర్జన.. చూశారా?

ఈ సమాచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్‌ కొట్టిపారేసింది. “ఆర్‌బీఐ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రూ.500 నోట్లు చట్టబద్ధంగా చలామణీలో ఉంటాయి” అని ఎక్స్‌లో స్పష్టం చేసింది.

ఇలాంటి తప్పుదారి చూపించే వార్తలను నమ్మవద్దని, అధికారిక సోర్సుల నుంచి సమాచారం వస్తేనే వార్తలను నమ్మాలని హెచ్చరించింది. ప్రస్తుతం ఆర్‌బీఐ నుంచి రూ.500 నోట్లకు సంబంధించిన ఏ విధమైన ప్రకటన కానీ సర్క్యులర్ కానీ వెలువడలేదు. రూ.500 నోట్లు దేశవ్యాప్తంగా చలామణీలో ఉన్నాయి.

ఏప్రిల్‌లో విడుదలైన ఒక ఆర్డర్‌ ప్రకారం.. రూ.100, రూ.200 నోట్ల అందుబాటును ఏటీఎంలలో పెంచాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఆర్‌బీఐ సూచించింది. అంతేగానీ, రూ.500 నోట్లపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.