Home Loan SIP
Home Loan SIP : హోం లోన్ తీసుకున్నారా? అయితే, లోన్ రీపేమెంట్ విషయంలో కంగారుపడొద్దు.. చాలామంది హోం లోన్ తీసుకున్నాక ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బందిపడిపోతుంటారు. సంపాదించిన మొత్తం ఇంటి ఈఎంఐలకే సరిపోతుందని బాధపడిపోతుంటారు. మీకు సరైన ప్లానింగ్ ఉంటే.. మీరు హోం లోన్ తీసుకున్నాక కూడా ఆ మొత్తంపై భారీ రాబడిని పొందవచ్చు. మీరు రీపేమెంట్ చేసే మొత్తం హోం లోన్ తిరిగి సంపాదించుకోవచ్చు.. అది ఎలా అంటారా? ఏం లేదండీ చాలా సింపుల్..
మీరు చేయాల్సిందిల్లా.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి (Home Loan SIP) పెట్టడమే.. హోం లోన్ రీపేమెంట్ చేయడమే కష్టంగా ఉంటే ఇంకా ఎస్ఐపీలో పెట్టుబడి ఎలా పెట్టడమంటే.. తప్పదు.. మీరు ఇక్కడే స్మార్ట్‌గా ఆలోచించాలి. గృహ రుణ గ్రహీతలకు, మ్యూచువల్ ఫండ్లలో ఒకటైన ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడం అనేది అద్భుతమైన మార్గం. మీ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత దాదాపు మొత్తం పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
SIPతో రూ. 62 లక్షలు సంపాదన :
ఉదాహరణకు.. మీరు 9శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ. 30 లక్షల హోం లోన్ తీసుకుంటే.. మీ ఈఎంఐ సుమారు రూ. 26,992 అవుతుంది. మీరు ఈఎంఐలో దాదాపు 25శాతం లేదా దాదాపు రూ. 6,750 ప్రతి నెలా SIPగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఎస్ఐపీ 20 ఏళ్లలో సగటున 12శాతం వార్షిక రాబడిని అందిస్తుంది. ఫలితంగా మొత్తం రూ. 62.09 లక్షల రాబడిని పొందవచ్చు. అదే సమయంలో మీరు హోం లోన్ ఈఎంఐల ద్వారా బ్యాంకుకు మొత్తం రూ. 64.78 లక్షలను తిరిగి చెల్లించి ఉంటారు. అందుకే ఎస్ఐపీ ద్వారా సేకరించిన మొత్తం గృహ రుణానికి దాదాపు సమానంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు.
ఈ ఎస్ఐపీ మెథడ్ ద్వారా మీ రుణంతో పాటు పెట్టుబడి పెట్టడంపై సంపదను పెంచుకోవచ్చు. రుణంపై చెల్లించే వడ్డీని తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు భారీగా రాబడి అందిస్తుంది.
సాధారణంగా లోన్ రీ పేమెంట్ అనేది రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. అయినప్పటికీ, మీరు పెట్టుబడికి ఎస్ఐపీలను హోం లోన్లతో కలపాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కాంపౌండింగ్, పూర్తి బెనిఫిట్స్ కోసం వీలైనన్ని సంవత్సరాలు ఎస్ఐపీలో పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి.
అప్పుడు మీ హోం లోన్ తిరిగి చెల్లించాక కూడా మీ SIPలో భారీగా రాబడి పొందవచ్చు. అంటే మీ హోం లోన్ పూర్తిగా తిరిగి చెల్లించడంతో పాటు మీ సేవింగ్స్ మరింత పెంచుకోవచ్చు. అందుకే గృహ రుణంతో SIP మొదలుపెట్టాలి. తద్వారా ఆర్థికంగా మెరుగుపడటమే కాకుండా హోం లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.