Train Coach Booking
Train Coach Booking : ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది. ఆపై పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గరపడుతోంది. ఈ సీజన్‌లో చాలా ఫ్యామిలీలు రైళ్లను బుకింగ్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాయి. ఒక సిటీ నుంచి మరో సిటీకి పెళ్లి ఊరేగింపుగా వెళ్లేందుకు మొత్తం రైల్ లేదా కోచ్ బుకింగ్ చేసుకుంటారు. బస్సులు లేదా రోడ్డు ప్రయాణంతో పోలిస్తే రైళ్లు మరింత సౌకర్యవంతంగానూ చాలా సురక్షితంగా ఉంటాయి.
పెళ్లిబృందంతో భారీ మొత్తంలో కలిసి ప్రయాణించేందుకు రైళ్లు (Train Coach Booking) చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే చాలామంది మొత్తం రైలు కోచ్ బుకింగ్ చేసుకుంటారు. అయితే, సాధారణ రైలు బుకింగ్ మాదిరిగా IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుకింగ్ చేయడం కుదరదు. మరి ఎలా బుకింగ్ చేసుకోవాలంటే.. ఇండియన్ రైల్వేస్ ఇందుకోసం ప్రత్యేక బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది.
ఫుల్ ట్రైన్ లేదా కోచ్ ఎక్కడ బుక్ చేసుకోవాలి? :
ఐఆర్‌సీటీసీ పూర్తి టారిఫ్ రేట్ (FTR) వెబ్‌సైట్ (https://www.ftr.irctc.co.in/ftr/) అనేది పూర్తి రైళ్లు లేదా వ్యక్తిగత కోచ్‌లను బుక్ చేసుకునే అధికారిక ప్లాట్‌ఫారం. బుక్ చేసుకోవడానికి వినియోగదారులు ముందుగా FTR వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత అకౌంట్లో లాగిన్ అయి అందుబాటులో ఉన్న రైలు ఆప్షన్లను చెక్ చేయాలి. ప్రయాణ నగరాలను ఎంచుకుని అవసరమైన పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్ ఆప్షన్‌తో పాటు ప్రయాణీకులు తమ సమీప రైల్వే స్టేషన్‌లో చార్టర్ రైలు బుకింగ్‌ల గురించి వివరాలను కూడా పొందవచ్చు.
రైలు ఫుల్ కోచ్ బుకింగ్ లిమిట్స్ :
అన్ని రైళ్లలో పూర్తి బుకింగ్‌లు అందుబాటులో ఉండవు. ఎఫ్‌టీఆర్ (FTR) వెబ్‌సైట్ మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఇంటర్‌సిటీ రైళ్లను మాత్రమే అందిస్తంది. అయితే రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను ప్రైవేట్ చార్టర్‌లకు బుక్ చేసుకోలేరు. అంతేకాకుండా, పండుగ, రద్దీ సీజన్లలో రైలు కోచ్ బుకింగ్‌లు పరిమితంగానే లభిస్తాయి. IRCTC ప్రకారం.. ఈ కింది సందర్భాల్లో రైలు కోచ్ బుకింగ్‌లు అందుబాటులో ఉండవు.
అక్టోబర్ 13, 2025 : నవంబర్ 4, 2025 (దీపావళి సీజన్)
ఫిబ్రవరి 25, 2026 : మార్చి 11, 2026 (హోలీ సీజన్)
పండుగల సమయంలో సాధారణ ప్రయాణీకులకు రైళ్లలో ప్రయాణించేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీపావళి, హోలీ సీజన్లలో కూడా బుకింగ్‌లు పరిమితంగా లభిస్తాయి.