Top Car Discounts : ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొంటున్నారా? చౌకగా కార్ల రుణాలు అందించే బ్యాంకులివే.. నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోండి!
Top Car Discounts : కొత్త కారు కొంటున్నారా? కస్టమర్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కారు రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి.. కారు కొనే ముందు ఈ వివరాలను తెలుసుకోండి.

Top Car Discounts
Top Car Discounts : అసలే పండగ సీజన్.. కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే అద్భుతమైన అవకాశం.. పండుగ సీజన్‌లో కారు కొనాలనుకునే కస్టమర్లు డిస్కౌంట్ ధరకే కారు కొనేసుకోవచ్చు. దేశంలోని అనేక ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కారు రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి.
ఇందులో వడ్డీ రేటు తగ్గింపులు, ప్రాసెసింగ్ ఫీజులపై (Top Car Discounts) తగ్గింపులు, దీర్ఘకాలిక కాలపరిమితిపై ఈఎంఐ ఆప్షన్లు అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ నవరాత్రి పండగ సీజన్‌లో 7.6 శాతం వద్ద కార్ల రుణాలను అందిస్తున్నాయి.
కారు లోన్ వడ్డీ రేట్లు :
పైసాబజార్ (PaisaBazaar.com) వెబ్‌సైట్ ప్రకారం.. సెప్టెంబర్ 2025లో కొత్త కారు కోసం 5 ఏళ్ల కాలానికి రూ. 5 లక్షల కారు రుణంపై వడ్డీ రేట్లు 7.60శాతం, 9.99శాతం మధ్య ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే, ప్రైవేట్ బ్యాంకులు కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి.
ప్రస్తుతం యూకో బ్యాంక్ అతి తక్కువ కార్ లోన్ వడ్డీ రేటును అందిస్తోంది. ఇక్కడ వడ్డీ రేట్లు 7.60శాతం నుంచి ప్రారంభమవుతాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 7.80 శాతం నుంచి 7.85శాతం వరకు కార్ లోన్లను అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులలో ఐసీఐసీఐ బ్యాంక్ 9.10శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 9.20శాతం వసూలు చేస్తాయి. వీటితో పోలిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొద్దిగా చౌకైన ధరకే కారు లోన్లను ఆఫర్ చేస్తున్నాయి.
ప్రాసెసింగ్ ఫీజులపై ఆఫర్లు :
కారు రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉంటాయి. చాలా బ్యాంకులు ఈ ఫీజులపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు.. కెనరా బ్యాంక్ రిటైల్ లోన్ ఫెస్టివల్ స్కీమ్ కింద సెప్టెంబర్ 30, 2025 వరకు ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేసింది.
అదేవిధంగా, ఐడీబీఐ బ్యాంక్ సైతం ఈ తేదీ వరకు జీరో ప్రాసెసింగ్ ఫీజులను అందిస్తోంది. మరోవైపు, కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఈ రుసుములను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 750 నుంచి రూ. 1,500 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. HDFC బ్యాంక్ గరిష్టంగా రూ. 9వేలు, ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ మొత్తంలో 2శాతం వరకు వసూలు చేస్తుంది.
ఎవరికి ఏ రుణం బెస్ట్ అంటే? :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కూడా 7.70శాతం నుంచి 7.85శాతం వరకు ప్రారంభ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. అయితే, ఫెడరల్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ వంటి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు 10శాతం లేదా అంతకంటే ఎక్కువ ప్రారంభ రేట్లను అందిస్తున్నాయి.
చాలా బ్యాంకులు తమ ప్రస్తుత కస్టమర్లకు అదనపు తగ్గింపులను కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణ కస్టమర్లకు లేదా 6 నెలల కన్నా ఎక్కువ అనుభవం ఉన్న అకౌంట్లు ఉన్నవారికి 0.25శాతం వడ్డీ రేటు తగ్గింపు అందిస్తుంది.
వడ్డీ రేట్లు బ్యాంకుపై మాత్రమే ఆధారపడి ఉండవు. మీ క్రెడిట్ హిస్టరీ, ఉద్యోగ స్థిరత్వం, నెలవారీ ఆదాయం కూడా తుది రుణ రేటును నిర్ణయిస్తాయి. అయితే, రుణం తీసుకునే ముందు ప్రతి బ్యాంకు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, నిబంధనలను తెలుసుకోండి. సరైన ఎంపిక చేసుకోవడం వల్ల ఈఎంఐలు తక్కువగా ఉండటమే కాకుండా మొత్తం ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.