ప్రపంచవ్యాప్తంగా కరోనా కన్నీళ్లు ఆగట్లేదు.. బయటకు రావాలంటే భయం వేసేలా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఉత్పత్తులపై, ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే ఈ వైరస్ కారణంగా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే చైనా కరోనా వైరస్ ప్రభావంతో పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. లేటెస్ట్‌గా దక్షిణ కొరియాలోని ఉల్సాన్‌లో హ్యూండయ్ కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసింది.
హ్యూండయ్ మోటార్ కంపెనీలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఫ్యాక్టరీని కొద్ది రోజులు మూసిస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ. చైనా తర్వాత అత్యధిక కరోనా కేసులు దక్షిణ కొరియాలో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ విస్తరించకుండా ఆ దేశం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. దక్షిణ కొరియాలో శుక్రవారం ఒక్కరోజే 256 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం సోకిన వారి సంఖ్య 2,022 కు చేరుకుంది.
ఇప్పటికే కరోనా వైరస్ సోకిన వ్యక్తికి వైద్య సేవలు అందిస్తుండగా.. కరోనా సోకిన ఉద్యోగితో పనిచేసిన సహోద్యోగులను కూడా నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఫ్యాక్టరీ మొత్తంలో క్రిమి సంహారక మందులతో శుద్ధి చేస్తున్నట్లు హ్యూండయ్ ప్రకటించింది. కొరియాలో ఉల్సాన్‌లో హ్యూండయ్ ఐదు కార్ల కర్మాగారాలను నిర్వహిస్తోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.4 మిలియన్ వాహనాలు. ఇందులో 34వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
See Also | పాకిస్థాన్‌లో ఘోరం : రైలు-బస్సు ఢీ..20మంది మృతి